Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!

  • కెప్టెన్సీ లేకపోయినా బ్యాటింగ్‌ను ఆస్వాదించడమే లక్ష్యం..
  • జింబాబ్వేపై హర్మన్‌ప్రీత్ కౌర్ 8వ వన్డే సెంచరీ
  • భారత్ 121 పరుగుల భారీ తేడాతో ఘన విజయం
  • కెప్టెన్సీ ఆలోచనలు బ్యాటింగ్‌పై ప్రభావం చూపవన్న హర్మన్‌ప్రీత్..
Harmanpreet Kaur

Harmanpreet Kaur

Harmanpreet Kaur: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో 121 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించిందింది. ఈ విజయం సాధించడంలో స్టార్ బ్యాటర్, టీమిండియా మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించింది. కొన్ని రోజుల క్రితం జింబాబ్వేతో జరిగిన టీ20లో 91 పరుగులు చేసిన ఆమె, ఈ మ్యాచ్‌లో తన 8వ వన్డే సెంచరీతో అదరగొట్టి తన స్థానానికి ఉన్న విలువను మరోసారి నిరూపించుకుంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత జీవితాన్ని మాములుగానే స్వీకరించానని, కేవలం బ్యాటింగ్‌ను ఆస్వాదించడమే తన లక్ష్యమని మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన అవార్డుల కార్యక్రమంలో హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది. వాస్తవాలకు దగ్గరగా జీవించడమే తన నైజమని, ప్రస్తుత పరిస్థితిని అంగీకరిస్తూ క్రికెట్ ఇచ్చే సంతోషాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు ఆమె తన అభిప్రాయాన్ని తెలిపింది.

తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్సీకి సంబంధించిన ఆలోచనలు ఏవీ తన మనసులోకి రావని, జట్టు పరిస్థితికి తగ్గట్టుగా బాధ్యత తీసుకుని ఆడటమే తన కర్తవ్యమని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. ఫార్మాట్ అవసరాలకు తగినట్లుగా మంచి బంతులను గౌరవిస్తూ, లూజ్ బంతులను బౌండరీలకు తరలించే వ్యూహంతో ఆడినట్లు తెలిపింది. సహచరి బ్యాటర్ ప్రతీక రావల్ (61 బంతుల్లో అర్ధ శతకం) తో కలిసి సరైన షాట్ల ఎంపికపై చర్చించినట్లు తెలిపింది. మ్యాచ్‌కు ముందు రాత్రి కాస్త జ్వరం ఉండటంతో మైదానంలో ఫీల్డింగ్ చేసే సమయంలో ఇబ్బంది పడ్డానని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపింది. కాగా.. ఈ సెంచరీతో హర్మన్‌ప్రీత్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను అధిగమించి, మహిళల వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక శతకాలు చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కింది. ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో 14 శతకాలతో స్మృతి మంధాన టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది.

భారత కెప్టెన్ స్మృతి మంధాన జట్టు ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఇన్నింగ్స్ ఆరంభంలో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ పుంజుకుని 328 పరుగుల భారీ స్కోరు సాధించడం మ్యాచ్‌లోని సానుకూల అంశమని పేర్కొంది. అద్భుత శతకం సాధించిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ నిలకడైన ఆటతీరును ఆమె ప్రత్యేకంగా కొనియాడింది. అలాగే 4 వికెట్లతో రాణించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ వైవిధ్యమైన పేస్, యాంగిల్స్ మార్పుతో మెప్పించిందని ప్రశంసించింది. వైట్ బాల్ క్రికెట్‌లో బ్యాటర్లు అలవాటు పడకుండా ఉండేందుకే బౌలర్లకు చిన్న స్పెల్స్ ఇచ్చే వ్యూహాన్ని అమలు చేశామని చెప్పుకొచ్చింది.