Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!

Harmanpreet Kaur

Harmanpreet Kaur

Harmanpreet Kaur: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన సమాధానంతో వార్తల్లో నిలిచారు. టోర్నీకి ముందు లండన్‌లో నిర్వహించిన కెప్టెన్ల మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన రిటైర్మెంట్ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ తన కెరీర్‌లో 10వ టీ20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే ఆమె చివరి ప్రపంచకప్ అవుతుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీడియా సమావేశంలో ఒక జర్నలిస్ట్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. “ఈ ప్రపంచకప్ మీ చివరిదా?” అని ప్రశ్నించాడు. దానికి హర్మన్‌ప్రీత్ వెంటనే, “ఎందుకు..? నేను ఆగిపోవాలని మీరు అనుకుంటున్నారా?” అంటూ ఎదురు ప్రశ్నించారు. రిపోర్టర్ “లేదు” అని సమాధానం ఇవ్వగానే, “అయితే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు?” అంటూ చిరునవ్వుతో బదులిచ్చారు. ఆమె సమాధానంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

×
×
Ad

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు హర్మన్‌ప్రీత్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. చాలా మంది ఆమె సమాధానాన్ని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన ఓ సమాధానంతో పోలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ధోనీని కూడా ఒక జర్నలిస్ట్ రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా.. ఆయన ఆ రిపోర్టర్‌ను తన పక్కన కూర్చోబెట్టి తన ఫిట్‌నెస్, పరుగెత్తే సామర్థ్యం, వయస్సు వంటి అంశాలపై ప్రశ్నలు అడిగి చివరకు సమాధానం చెప్పకుండానే ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లుగా వ్యవహరించారు. దానితో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ బాగా వైరల్ అయ్యింది.

ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అదే తరహాలో రిపోర్టర్‌కు ఎదురుప్రశ్న వేసి రిటైర్మెంట్ చర్చలకు చెక్ పెట్టారు. ఆమె సమాధానం అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా భారత మహిళల జట్టు నాయకత్వంపై మరోసారి చర్చకు దారితీసింది. ఇటీవల స్వదేశంలో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి గెలిచిన భారత జట్టు, ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించింది. ఇప్పటివరకు మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందుకోలేకపోయిన టీమిండియా, ఈసారి ఆ కలను నిజం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో భారత జట్టు చరిత్ర సృష్టిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.