NTV Telugu Site icon

Mumbai Indians: అప్పుడు వద్దనుకున్న హార్దిక్ పాండ్యాను.. ముంబై ఇండియన్స్ పట్టుబట్టి తీసుకుంది అందుకేనా?

Hardik Pandya Mumbai

Hardik Pandya Mumbai

Why Hardik Pandya Joins Mumbai Indians again: ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌కు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఫ్రాంచైజీ మార్పు ఇందులో ప్రధానమైన అంశం. గుజరాత్‌ టైటాన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌ హార్దిక్‌ను రిటైన్‌ చేసుకున్నట్లే చేసుకుని.. అంతలోనే ట్రేడింగ్‌ అంటూ ముంబై ఇండియన్స్‌కి వదిలేసింది. ఈ అనూహ్య పరిణామం ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకసారి టైటిల్‌, మరోసారి రన్నరప్‌గా నిలబెట్టిన హార్దిక్‌ను గుజరాత్ ఎందుకు వదులుకుంది?, హార్దిక్‌ కోసం ముంబై ఎందుకు ఆసక్తికనబర్చింది? అనే ప్రశ్నలు సగటు క్రికెట్ అభిమాని మదిలో ఉన్నాయి. హార్దిక్ ట్రేడింగ్ అనేక సందేహాలకు తావిస్తోంది.

2015లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ కెరీర్ మొదలు పెట్టిన హార్దిక్ పాండ్యా.. 2021 వరకూ అదే జట్టుకే ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో ఆల్‌రౌండర్‌గా మంచి గుర్తింపు పొందాడు. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ.. జట్టుకు ఎన్నో విషయాలు అందించాడు. అయిదు ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో.. ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న హార్దిక్‌ను ముంబై వదిలేసింది. 2022 వేలంలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. హార్దిక్‌ను రూ.15 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ కూడా అప్పగించింది.

హార్దిక్ పాండ్యా సారథ్యంలో 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించింది. ఇక 2023లో రన్నరప్‌గా నిలిచింది. దాంతో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ మాదిరి చాలా ఏళ్లు ఒకే జట్టుకు హార్దిక్ సారథిగా ఉంటాడని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. గుజరాత్‌ టైటాన్స్ కెప్టెన్సీ కూడా వదులుకుని ముంబై ఇండియన్స్ జట్టులో చేరుతున్నాడు. అప్పుడు వద్దనుకున్న హార్దిక్‌ను ఇప్పుడు ముంబై పట్టుబట్టి తీసుకుందట. ఇందుకు కారణం లేకపోలేదు.

Also Read: JioPhone Prima 4G Plans: జియోఫోన్‌ ప్రైమాకు ప్రత్యేక ప్లాన్‌లు.. అన్నింటిలో డేటా ప్రయోజాలు!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు వారసుడిగా హార్దిక్ పాండ్యాను ప్రకటించే ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ వయసు 37 ఏళ్లు. హిట్‌మ్యాన్ ఇంకా ఎన్ని సీజన్లు ఆడుతాడో కచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతం జట్టులో కెప్టెన్సీ చేయగల సమర్థులు లేరు. పైగా గత రెండు సీజన్లుగా రోహిత్ కెప్టెన్సీ దారుణంగా ఉంది. దాంతో టీమిండియా టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ను తదుపరి సారథిగా చేయాలనుకుంటోందట. రోహిత్‌తో చర్చించిన తర్వాతనే.. హార్దిక్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024నే కాకున్నా.. 2025లో అయినా ముంబై సారథ్య బాధ్యతలు హార్దిక్‌చేపట్టే అవకాశాలు ఉన్నాయి.