NTV Telugu Site icon

Champions Trophy 2025: రెడీగా ఉండండమ్మా.. భారత్ బ్రాండ్ క్రికెట్‌ను చూపిస్తాం: హార్దిక్‌ పాండ్యా

Hardik Pandya Champions Trophy 2025

Hardik Pandya Champions Trophy 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌లో ట్రోఫీ జరగనుండగా.. భారత్‌ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌ వేదికగా జరగనున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండడంతో ప్రతి టీమ్ టైటిల్ సాధించాలని చూస్తోంది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చివరిసారిగా 2013లో భారత్ ట్రోఫీ సాధించింది. ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు కప్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారత్ బ్రాండ్ క్రికెట్‌ను చూపిస్తాం అని, ఫాన్స్ రెడీగా ఉండాలని హార్దిక్‌ పాండ్యా చెప్పాడు. ఐసీసీ లాంచ్‌ చేసిన ‘ఆల్‌ ఆన్ ది లైన్’ క్యాంపెయిన్‌లో హార్దిక్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ… ‘ఛాంపియన్స్‌ ట్రోఫీని 8 ఏళ్ల తర్వాత నిర్వహించనుండటం క్రికెట్‌కు మంచి పరిణామం. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌కు మరింత వన్నె తీసుకొస్తుంది. ఈ టోర్నీ కోసం అభిమానులతో పాటు మేం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు సిద్ధంగా ఉంది. మా బ్రాండ్‌ క్రికెట్‌ను ప్రదర్శించాలని ప్రతి ఒక్కరు చూస్తునారు’ అని చెప్పాడు.

Also Read: RCB Jersey: కుంభమేళాలో ఆర్సీబీ జెర్సీకి గంగాస్నానం, ప్రత్యేక పూజలు.. ఈ సాలా కప్ నమ్‌దే!

‘ఆల్‌ ఆన్ ది లైన్’ క్యాంపెయిన్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్‌ సాల్ట్, పాకిస్థాన్‌ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది కూడా పాల్గొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచేందుకు ఇంగ్లండ్‌ చివరి వరకూ పోరాడుతుందని సాల్ట్ తెలిపాడు. ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నాడు. పాకిస్థాన్‌కు క్రికెట్‌ అంటే కేవలం ఆట మాత్రమే కాదని.. ప్యాషన్, గౌరవం, గుర్తింపు అని అఫ్రిది పేర్కొన్నాడు. పాక్ ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని, ఫిబ్రవరి 19 కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోందని చెప్పాడు.