Site icon NTV Telugu

Hardik Pandya: బుమ్రా, బౌల్ట్ ఉన్నా ఫలితం శూన్యం.. ముంబై ఓటమిపై పాండ్యా ఫైర్.. బౌలర్లపై తీవ్ర విమర్శలు!

Pandya

Pandya

Hardik Pandya: నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై, రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిలో ఓడింది ముంబై. అయితే.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఎదుర్కొన్న పరాజయంపై ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్ల ప్రదర్శనపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. జైస్వాల్ కేవలం కొన్ని ఓవర్లలోనే అజేయంగా 77 పరుగులు చేసి ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ముంబై 123 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.

READ MORE: Repo Rate: రెపో రేట్ పై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన.. ఈఎంఐ తగ్గుతుందా?

ఈ ఓటమికి బ్యాటర్లను నిందించలేమని, బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణమని పాండ్యా స్పష్టం చేశాడు. “టీ20 క్రికెట్‌లో బౌలర్ల పాత్రం కీలకం. కొన్ని బంతులే మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయిస్తాయి. మా టీమ్ బౌలర్లు ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యారు. 27 పరుగుల తేడాతో ఓడిపోయామంటే, కేవలం ఒక ఐదు మంచి బంతులు వేసి ఉంటే లేదా ఐదు సిక్సర్లను అడ్డుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. రాజస్థాన్ ఓపెనర్లు తొలి రెండు ఓవర్లలోనే అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత మేము కేవలం కోలుకోవడానికి ప్రయత్నించడమే సరిపోయింది. ముంబై బౌలింగ్ యూనిట్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. బౌలర్లు బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.” అని పాండ్యా వెల్లడించాడు. మరోవైపు.. రాజస్థాన్ జట్టు అద్భుతమైన క్రికెట్ ఆడిందని మెచ్చుకుంటూనే, తమ బౌలర్లు కనీస స్థాయిలో కూడా రాణించలేదని అసహనం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టులోని స్టార్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. వీరంతా కలిసి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టడం గమనార్హం. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మినహా మిగిలిన బౌలర్లందరూ 10 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చారు.

Exit mobile version