Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్‌తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు

  • యుద్ధం కారణంగా చమురు కొరత
  • మనుగడలోకి ఇథనాల్
  • ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దన్న కేంద్రమంత్రి
  • త్వరలో చౌకగా E85!
Hardeep Singh Puri

Hardeep Singh Puri

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు కొరత ఏర్పడింది. దీంతో అనేక దేశాలు చాలా ఇబ్బందులు పడ్డాయి. భారత్‌ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. పలుమార్లు గ్యాస్, చమురు ధరలు పెంచాల్సి వచ్చింది. యుద్ధం తగ్గుముఖం పడుతుందని అనుకుంటుంటే.. మరోసారి రణరంగంగా మారింది. తాజాగా మరోసారి ఇరాన్-అమెరికా పరస్పర దాడులు చేసుకోవడంతో మళ్లీ పరిస్థితులు మొదటికొచ్చాయని అంచనా వేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ను మనుగడలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి విక్రయిస్తోంది. అయితే ఇథనాల్ కారణంగా వాహనాల ఇంజిన్ పాడవుతున్నాయని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ఇథనాల్‌పై ఎలాంటి భయాలు అవసరం లేదని చెప్పారు. త్వరలో చౌకగా E85 ఇంధనం లీటర్‌కు రూ.20కే విక్రయిస్తామని తెలిపారు. E20 వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు దేశాన్ని ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లే కీలక కార్యక్రమమని పేర్కొన్నారు.

‘‘సుజుకి సంస్థ ఇప్పటికే 1.5 కోట్ల వాహనాలకు సర్వీసింగ్ చేసింది. కానీ ఇథనాల్ కారణంగా ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.’’ అని తెలిపారు. వాహన తయారీ సంస్థలు, మెకానిక్‌లు కూడా ఎలాంటి పెద్ద సమస్యలు గుర్తించలేదని చెప్పారు. E20 పెట్రోల్ వాడితే వాహన వారంటీ రద్దవుతుందని, ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరిస్తాయనే ప్రచారం జరిగిన విషయాన్ని గుర్తుచేసిన మంత్రి.. ఇప్పుడు అలాంటి సమస్యలు పూర్తిగా పరిష్కరించామని తెలిపారు. వాహనదారులు వారంటీ లేదా బీమా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

మైలేజీ కొద్దిగా తగ్గొచ్చు..

ఇథనాల్‌లో సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే శక్తి విలువ (క్యాలరిఫిక్ వ్యాల్యూ) కొద్దిగా తక్కువగా ఉండటంతో మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంగీకరించారు. అయితే ఇథనాల్ వల్ల లభించే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ‘‘మైలేజీని మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవద్దు. ఇది పర్యావరణహిత సాంకేతికత వైపు తీసుకెళ్తున్న ఒక ముఖ్యమైన అడుగు.’’ అని పేర్కొన్నారు. ‘‘వాహనం పికప్, యాక్సిలరేషన్ మెరుగుపడుతుంది. అధిక ఆక్టేన్ విలువ ఉండటంతో ఇంజిన్ నాకింగ్ తగ్గుతుంది. ఇంజిన్‌లో పరిశుభ్రమైన దహనం జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఇంజిన్‌కు ఎలాంటి నష్టం ఉండదని పరీక్షలు నిర్ధారించాయి.’’ అని తెలిపారు.

త్వరలో చౌకగా E85..

వినియోగదారులకు ఊరట కలిగించే మరో కీలక ప్రకటనను కూడా మంత్రి చేశారు. 85 శాతం వరకు ఇథనాల్ కలిగిన E85 ఇంధనాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ ఇంధనం ప్రస్తుతం ఉన్న E20 పెట్రోల్‌తో పోలిస్తే లీటరుకు సుమారు రూ.20 వరకు తక్కువ ధరకు లభించే అవకాశం ఉందని తెలిపారు. అయితే E85ను ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు (Flex-Fuel Vehicles – FFVs) మాత్రమే వినియోగించగలవని స్పష్టం చేశారు. ఇథనాల్ మిశ్రమ ఇంధన కార్యక్రమం వల్ల దేశానికి భారీ ఆర్థిక ప్రయోజనం కలుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ‘‘ఈ కార్యక్రమం లేకపోయి ఉంటే భారత్ మరింత ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దాంతో పెట్రోల్ ధరలు ఇప్పటి కంటే ఇంకా ఎక్కువగా ఉండేవి.’’ అని తెలిపారు. ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల విదేశీ చమురు దిగుమతులు తగ్గడంతో పాటు రైతులకు కూడా ప్రత్యక్ష లాభం చేకూరుతోందని చెప్పారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి బలాన్నిస్తోందని వివరించారు.

E25 ఇంకా ప్రయోగ దశలోనే

భవిష్యత్తులో E25 పెట్రోల్‌పై వస్తున్న వార్తలపై కూడా మంత్రి స్పందించారు. ప్రస్తుతం E25 కేవలం ప్రయోగ దశలో మాత్రమే ఉందని, దానిని E20తో కలిపి ప్రజలు అపోహలు పడవద్దని సూచించారు. శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగానే భవిష్యత్తులో తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఇథనాల్ విధానం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు ఎలాంటి ఆటంకం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ‘‘నేను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల కార్యక్రమానికి కూడా మద్దతుదారునే. బయోఫ్యూయల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు రెండూ కలిసి భారత రవాణా రంగ భవిష్యత్తును నిర్మిస్తాయి.’’ అని హర్దీప్ సింగ్ పూరీ అన్నారు.