Harbhajan Singh Feels Sanju Samson Get A Place in India for T20 World Cup 2024: రోహిత్ శర్మ అనంతరం టీమిండియా టీ20 బాధ్యతలను ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు అప్పగించొద్దని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను గొప్పగా నడిపిస్తున్న సంజు శాంసన్‌కు భారత జట్టు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం భారత జట్టుకు అన్ని ఫార్మాట్‌లలో రోహిత్ కెప్టెన్‌గా ఉన్నాడు. హిట్‌మ్యాన్ గైహాజరీలో హార్దిక్ టీ20 బాధ్యతలను అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో హార్దిక్ జట్టును నడిపిస్తాడనుకున్నా.. రోహితే కెప్టెన్ అని బీసీసీఐ స్పష్టం చేసింది. హార్దిక్ వైఫల్యాలే ఇందుకు కారణం.
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ దూసుకెళుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలు సాధించి.. టేబుల్ టాప్‌లో కొనసాగుతోంది. రాజస్థాన్‌ను సంజు శాంసన్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. అంతేకాదు కీపర్, బ్యాటర్‌గా కూడా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ ఓ ట్వీట్ చేశారు. ‘ఫామ్ టెంపరరీ, క్లాస్ పర్మనెంట్ అని యశస్వి జైస్వాల్ తన ఇన్నింగ్స్‌తో నిరూపించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ స్థానం గురించి ఎలాంటి చర్చ అవసరం లేదు. భారత జట్టులో సంజు శాంసన్ ప్లేస్ ఖరారైనట్లే. రోహిత్ శర్మ తర్వాత భారత టీ20 కెప్టెన్‌గా శాంసన్ ఉండాలి’ అని పేర్కొన్నారు.
Also Read: OnePlus Nord CE 3 Price: వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. నార్డ్ సీఈ3పై భారీ డిస్కౌంట్!
హర్భజన్ సింగ్ చెప్పినట్లే సంజు శాంసన్ టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీపర్ రేసులో ఉన్న ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2024లో పెద్దగా రాణించడం లేదు. సంజు సహా దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ మాత్రమే సత్తా చాటుతున్నారు. ఈ ముగ్గురిలో పంత్, సంజులకు చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చూడాలి మరి బీసీసీఐ సెలెక్టర్లు ఎవరికి అవకాశం ఇస్తారో. మరోవైపు హర్భజన్ సింగ్ భారత తదుపరి కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ పేర్లను పరిగణలోకి తీసుకోలేదు.