Harbhajan Singh apologizes to India Para Athletes: భారతదేశంలోని దివ్యాంగులకు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. ఎవరి మనోభావాలను కించపర్చడం తన ఉద్దేశం కాదని, తెలియక జరిగిన తప్పుకు క్షమించాలని కోరాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 టోర్నీ ఆడిన అనంతరం తమ నొప్పుల బాధను తెలియజేసేందుకే ఆ వీడియో చేశాం అని, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండని కోరాడు. డబ్ల్యూసీఎల్ 2024 టైటిల్‌ను భారత్ గెలిచిన విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో జరిగిన ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.
డబ్ల్యూసీఎల్ 2024 టైటిల్ నెగ్గిన జోష్‌లో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనాలు ‘బ్యాడ్ న్యూస్’లోని తౌబా తౌబా హుక్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేశారు. ఈ రీల్‌లో ముగ్గురు తమ నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడిచారు. ’15 రోజుల డబ్ల్యూసీఎల్ టోర్నీ తర్వాత మా శరీరాలు కూడా తౌబా తౌబా అయ్యాయి. చాలా నొప్పిగా ఉంది. ఇది మా వెర్షన్ తౌబా తౌబా’ అని ఆ వీడియోకి రాసుకొచ్చారు. ఈ వీడియోను విక్కీ కౌశల్, కరణ్ జోహార్‌కు ట్యాగ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ రీల్‌పై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. మరోవైపు పారా అథ్లెట్లు సైతం ముగ్గురు భారత మాజీ ఆటగాళ్లపై విమర్శల వర్షం కురిపించారు. దాంతో హర్భజన్ సింగ్ ఆ రీల్‌ను తొలగించి క్షమాపణలు చెప్పాడు. ‘డబ్ల్యూసీఎల్ గెలిచిన అనంతరం మేం చేసిన టౌబా టౌబా రీల్‌పై విమర్శలు వచ్చాయి. అందుకే వివరణ ఇవ్వాలనుకుంటున్నా. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. టోర్నీ ఆడిన తర్వాత మా నొప్పుల బాధను వీడియో ద్వారా చెప్పాం. ఎవరిని కించపర్చడం మా ఉద్దేశం కాదు. అయినా కూడా మేం తప్పు చేశామని భావించే వారికి క్షమాపణలు చెబుతున్నా. ఈ విషయాన్ని వదిలేయండి’ అని హర్భజన్ పేర్కొన్నాడు.