NTV Telugu Site icon

Harassment : యువతి ఫోటోలు నగ్నంగా మార్ఫింగ్‌.. డబ్బులు కావాలంటూ బ్లాక్‌మెయిల్‌.. విచారణ చేస్తే..

Fake Insta Account

Fake Insta Account

టెక్నాలజీ పెరుగుతోంది.. అందుకు తగ్గట్టుగానే మోసాలూ పెరుగుతున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీని మంచికంటే ఎక్కువగా చెడుకే వినియోగిస్తున్నారు. అయితే.. నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాతో వేధింపులకు పాల్పడిన ఘటన జీడిమెట్లలో చోటు చేసుకుంది. నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాతో యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి, డబ్బు ఇవ్వాలని వేధిస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ ఎం. పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలో నివాసముండే ఓ యువతికి, చిన్ననాటి మిత్రురాలి ద్వారా ఇన్స్టాలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన నవదీప్ పరిచయమయ్యాడు. తాజాగా ఇంటర్మీడియట్ పూర్తిచేసి, డిగ్రీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. స్నేహంగా ఉంటూ యువతి ఇన్స్టా ఖాతా వివరాలు తెలుసుకున్నాడు.

 

అనంతరం తాను వేరే పేరుతో ఓ నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచి, యువతికి సందేశాలు మొదలు పెట్టాడు. అనంతరం ప్రొఫైల్ ఫొటోను నగ్నచిత్రంగా మార్చి.. సదరు యువతికి పంపిస్తూ.. డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. వేధింపులు రోజురోజుకూ పెరుగుతుండటంతో యువతి ఠాణాకి వచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో.. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించగా.. నవదీపే ఈ పని చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసి విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పవన్ తెలిపారు.