NTV Telugu Site icon

MS Dhoni Birthday: గోల్డెన్ డకౌట్‌తో మొదలై.. సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా! అదొక్కటి మాత్రం వెలితి

Happy Birthday Ms Dhoni

Happy Birthday Ms Dhoni

MS Dhoni Turns 43 Today: అతడి రాక భారత క్రికెట్‌కు వెలుగును తీసుకొచ్చింది.. చేజారుతున్న మ్యాచ్‌లు గెలవొచ్చనే ధీమా వచ్చింది.. మొదటి ప్రయత్నంలోనే పొట్టి ప్రపంచకప్ వచ్చింది.. స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ పంజా విసరగలమనే ఆత్మవిశ్వాసం దరిచేరింది.. మైదాంలో అద్భుతాలు మొదలయ్యాయి.. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తొన్న వన్డే ప్రపంచకప్‌ సొంతమైంది.. టెస్ట్ టాప్ ర్యాంక్ దక్కింది.. భారత జట్టులో చోటుదక్కుతుందనే ధీమా యువ ఆటగాళ్లకు వచ్చింది.. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది.. అతడి గురించి ఇలా చెప్పుకుంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. అతడు ఎవరో ఈపాటికే అర్దమైపోయుంటుంది. అతడే ప్రపంచ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ. నేడు 43వ ఏట అడుపెడుతున్న సందర్భంగా మహీకి ప్రముఖ తెలుగు ఛానెల్ ‘ఎన్టీవీ’ తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.

గోల్డెన్ డకౌట్‌తో కెరీర్ ఆరంభం:
దేశవాళీల్లో సిక్సులతో దుమ్ములేపిన ఎంఎస్ ధోనీ.. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004లో బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేశాడు. మహీ కెరీర్ గోల్డెన్ డకౌట్‌తో మొదలైనా.. ఆ తర్వాత సునామీ ఇన్నింగ్స్‌లతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. మహీ భారత్ తరఫున 350 వన్డేలు, 90 టెస్ట్‌లు, 98 టీ20ల్లో ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 17,266 రన్స్ బాదాడు. అంతేకాదు కీపర్‌గా 829 ఔట్లలో పాలుపంచుకొన్నాడు.

తిరుగులేని శక్తిగా భారత్:
ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత జట్టు తిరుగులేని శక్తిగా ఎదిగింది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో ప్రత్యర్థికి కొరకరాని కొయ్యగా మారింది. టెస్టులో నంబర్ వన్ పొజిషన్ చేరుకుంది. ఈ ఘనత సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాలేదు. ఇక పరిమిత ఓవర్లలో బలమైన జట్టుగా మారింది. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ సత్తా చాటగలం అని తన కూల్ కెప్టెన్సీతో నిరూపించాడు.

Also Read: Happy Birthday MS Dhoni: కెప్టెన్‌లలో ‘ఎంఎస్ ధోనీ’ వేరే లెవెల్.. టాప్ రికార్డ్స్ ఇవే!

వరల్డ్ బెస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌:
ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో చాంపియన్ ట్రోఫీ సాధించి.. ఐసీసీ మూడు మేజర్ టైటిళ్లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ఈ మూడు టైటిళ్లను మరే ఇతర జట్ల కెప్టెన్ కూడా గెలవలేదు.

అదొక్కటి మాత్రం వెలితి:
ఎంఎస్ ధోనీ 2014లో టెస్టులకు వీడ్కోలు పలికాడు. 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న మహీ.. 2 సంవత్సరాలు బ్యాట్స్‌మన్‌, కీపర్‌గా కొనసాగుతూ విరాట్ కోహ్లీకి అండగా ఉన్నాడు. 2019 ప్రపంచకప్‌ అనంతరం ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉన్న ధోనీ.. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చాడు. అయితే భారత క్రికెట్‌కు ఎంతో చేసిన ధోనీకి సరైన రీతిలో వీడ్కోలు దక్కలేదు. సచిన్ టెండూల్కర్ తరహాలో ఆటకు సగర్వంగా వీడ్కోలు పలికితే చూడాలని కలలు కన్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

Show comments