Hamas Leadership: ఖతార్ రాజధాని దోహపై ఇజ్రాయెల్ దాడి ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ప్రపంచంలో హమాస్ నాయకత్వం ఎక్కడ దాక్కున్న వదిలి పెట్టమని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ దోహపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో ప్రాణాలతో బయటపడిన హమాస్ అగ్ర నాయకత్వం.. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అల్ ఖలీల్ అల్ హయ్యా, ఒసామా హమ్దాన్, ఇజ్జత్ అల్-రిష్క్ అజ్ఞాతంలో ఉన్న హమాస్ నాయకత్వంలో ప్రముఖులు. ఇక్కడ విశేషం ఏమిటంటే గాజా ఒప్పందం విషయంలో ఆదేశాలు జారీ చేసే అధికారం ఈ ముగ్గురు అధికారుల చేతుల్లో ఉన్నట్లు సమాచారం.
READ ALSO: Pakistan: పాకిస్తాన్ ఎన్నికల్లో రిగ్గింగ్, నిజాలు దాచిన కామన్వెల్త్ ప్యానెల్..
సస్పెన్స్ అలాగే కొనసాగుతుంది..
హమాస్ అగ్రనాయకత్వం ఎక్కడ దాక్కున్నారనే దానిపై ఇప్పటికీ సస్పెన్స్ అలాగే కొనసాగుతుంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో వారిని గుర్తించి చంపుతామని చెప్పినట్లు సమాచారం. టర్కీ, ఖతార్ వంటి మధ్యప్రాచ్య దేశాలలో హమాస్ స్థావరాలు ఉన్నాయి. హమాస్‌కు ఖతార్‌లో రాజకీయ కార్యాలయం ఉంది. ఇటీవల యాహ్యా సిన్వర్ భార్యను గాజా నుంచి టర్కీకి బంకర్ ద్వారా పంపించినట్లు సమాచారం. హమాస్ అధికారులు టర్కీలో అజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ కూడా జరుగుతోంది. టర్కీపై దాడి చేయడంపై ఇజ్రాయెల్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే టర్కీ నాటో సభ్యదేశం. ఒక వేళ ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇప్పటికే ఉన్న సమస్యలు రెట్టింపుగా పెరుగుతాయి. నాటో రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 ప్రకారం ఏదైనా దేశం నాటో సభ్య దేశంపై దాడి చేస్తే.. ఆ దాడి కూటమిలోని అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు.
చర్చల బృందాన్ని అంతం చేయాలనే ప్లాన్‌లో ఇజ్రాయెల్..
పలు నివేదిక ప్రకారం.. హమాస్ చర్చల బృందాన్ని చంపాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ వాళ్లను చంపడం ద్వారా బందీ ఒప్పందంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు వినికిడి. ఖలీల్-అల్-హయ్యా బృందం ఇజ్రాయెల్ మాట వినడం లేదని నెతన్యాహు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ తీరుపై అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చర్చల బృందంపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ బందీ ఒప్పందాన్ని ముగించాలని కోరుకుంటోందని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన స్థానం సురక్షితంగా ఉండటానికి యుద్ధాన్ని తీవ్రతరం చేయాలనుకుంటున్నారని స్వదేశంలోని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.
హమాస్ నాయకత్వంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో అగ్ర నాయకులకు ఎటువంటి హాని జరగలేదని సమాచారం. కానీ ఈ దాడిలో ఐదుగురు మరణించారని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో ఖలీల్ అల్-హయ్యా కుమారుడు కూడా ఉన్నాడని పేర్కొన్నారు. ఇంతకీ ఆ దాడి తర్వాత హమాస్ అగ్రనాయకత్వం వెళ్లిన రహస్య ప్రదేశం గురించి ఇజ్రాయెల్‌కు ఇప్పటికే సమాచారం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వాళ్లను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడి చేస్తుందా లేదా అనేది. పైన చెప్పుకున్నట్లు నాటో సభ్య దేశంపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌కు సమస్యలు తప్పవు. చూడాలని ఇజ్రాయెల్ తర్వాత అడుగు ఎలా ఉంటుందో.
READ ALSO: Apollo Tyres: గాలి తీసేసిన టైర్ నుంచి.. టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ వరకు.. ఏం జర్నీ బాస్
