జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ) ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గరపడటంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచీ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో మేయర్ స్థానంతో పాటు మొత్తం 120 వార్డు సభ్యుల కోసం పోలింగ్ నిర్వహించారు. మేయర్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఒకేసారి జరగనుండగా, ఫలితాలు రెండు రౌండ్లలోనే తేలిపోయే అవకాశం ఉంది. రేపటి ఉదయం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సమర్పించడానికి అవకాశం కల్పించారు.
మరోవైపు జీవీఎంసీ పరిధిలో నమోదైన పోలింగ్ శాతంపై రాజకీయ వివాదం ప్రారంభమైంది. రాత్రికి రాత్రి దాదాపు ఐదు శాతం పోలింగ్ పెరిగినట్టు అధికారులు ప్రకటించడంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోలింగ్ పర్సంటేజ్ అకస్మాత్తుగా పెరగడంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ, మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి నేతృత్వంలో వైకాపా బృందం ఎన్నికల అధికారులను కలసి తమ ఫిర్యాదును అందజేయనుంది.
ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో నగర ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో గతం కంటే పోలింగ్ శాతం తగ్గింది. జీవీఎంసీ మొత్తం పరిధిలో 56.32 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 18,37,901 మంది ఓటర్లకు గాను 10,35,154 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో నిరసన కనిపించినప్పటికీ, భీమిలి, అనకాపల్లి, పెందుర్తి వంటి సెమీ అర్బన్ ఏరియాల్లో మాత్రం ఓటర్లు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా భీమిలి జోన్లో అత్యధికంగా 66.27 శాతం పోలింగ్ నమోదవ్వడం విశేషం. రేపు ఉదయం లెక్కింపు ప్రారంభమైన కొద్దిసేపటికే విజేతలు ఎవరో తేలనుండటంతో అందరి దృష్టి ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ పైనే నిలిచింది.

