GV Narayana Rao: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత

Gv Narayana Rao

Gv Narayana Rao

GV Narayana Rao: తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) తో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.

కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన జీవీ నారాయణరావు మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్‌లో నటనా శిక్షణ తీసుకున్నారు. ఆయన ప్రముఖ కథానాయకులు రజనీకాంత్, చిరంజీవిలకు అత్యంత ఆప్తమిత్రుడు. 1976లో వచ్చిన దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ సినిమా ‘అంతులేని కథ’తో వెండితెరకు పరిచయమైన ఆయన.. ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. వెండితెరపైనే కాకుండా పలు ప్రముఖ టీవీ సీరియళ్ల ద్వారా కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లి నీకు శుభం నాకు వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోవడంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.