NTV Telugu Site icon

Gujarat Rains 2023: గుజరాత్‌లో వడగండ్ల వాన.. 20 మంది మృతి!

Lightning Strike

Lightning Strike

20 Killed amid unseasonal rains lash Gujarat: ఆదివారం గుజరాత్‌ రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగండ్ల వర్షం పడింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ప్రాణ నష్టం కూడా జరిగింది. పిడుగులకు 20 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నేడు కూడా గుజరాత్‌లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మొత్తానికి అకాల వర్షాలతో గుజరాత్‌ అతలాకుతలమైంది.

గుజరాత్‌లోని 234 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ప్రభావిత జిల్లాలలో దాహోద్, బరూచ్, తాపి, అహ్మదాబాద్, అమ్రేలి, బనస్కాంత, బొటాడ్, ఖేదా, మెహసానా, పంచమహల్, సబర్‌కాంత, సూరత్, సురేంద్రనగర్ మరియు దేవభూమి ద్వారక ఉన్నాయి. సూరత్‌, సురేంద్రనగర్‌, ఖేద, తాపి, భరూచ్‌లో గడిచిన 16 గంటల్లో రికార్డు స్థాయిలో 50-117 మిమీ వర్షపాతం నమోదైంది. దీంతో చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి.

Also Read: IPL Retentions 2024: ఆర్‌సీబీ భారీ ప్రక్షాళన.. రిలీజ్ లిస్ట్‌లో స్టార్ క్రికెటర్లు! ఆ భారత ప్లేయర్ చాలా లక్కీ

పిడుగుపాటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక యంత్రాంగం నిర్వహిస్తున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాజస్థాన్‌, మహారాష్ట్రలో కూడా ఆదివారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. దీంతో గుజరాత్‌, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో నేడు కూడా వర్షాలు కురిసే అవకాశముంది.

Show comments