Gujarat Man Suicide: గుజరాత్‌కు చెందిన 24 ఏళ్ల పోస్టల్ ఉద్యోగి విశ్వరాజ్ మయూరసింహ్ గోహిల్ మహారాష్ట్రలోని కొంకణ్కడా కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్యతో వివాదం, ఆమె కుటుంబం వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన వీడియోలో చెప్పాడు. భార్య, ఆమె కుటుంబం వల్ల మానసిక, ఆర్థిక, సామాజిక ఒత్తిళ్ల గురించి అందులో ప్రస్తావించారు. నేను, నా తల్లి, సోదరుడు కలిసి భార్యపై దాడి చేశామని ఆరోపిస్తోందని, ఇది పూర్తిగా అబద్ధమని చెప్పారు.
భావ్‌నగర్‌కు చెందిన గోహిల్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. 8 నెలలకే దంపతుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. సెప్టెంబర్ 12 గోహిల్‌పై భార్య గృహహింస కేసు పెట్టింది. దీనిపై అక్టోబర్ 09న గోహిల్ కోర్టుకు హాజరయ్యారు. తన వైవాహిక జీవితంలోని ఇబ్బందులు, న్యాయప్రక్రియపై గోహిల్ తన ఆవేదన వ్యక్తపరిచారు. తనపై, తన తల్లి, సోదరుడిపై చేసిన ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు. తన భార్యను వారి తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్లారని, నగలు, వస్తువుల విషయంలో తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని వీడియోలో ఆరోపించారు. ఆత్మహత్యకు ముందు తన తల్లిదండ్రులు, 16 ఏళ్ల తమ్ముడి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. గృహహింస చట్టాలు దుర్వినియోగం జరుగుతున్నాయని గోహిల్ వీడియోలో చెప్పారు. గోహిల్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

