Restaurant Worker Gets RS 4.60 Cr Notice in Nandyal: నంద్యాల జిల్లాలో జీఎస్టీ కలకలం రేపింది. మిడుతూరు మండలం పైపాలెంకు చెందిన నవీన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి రూ.4.60 కోట్లు జీఎస్టీ చెల్లించాలని నోటీసులు వచ్చాయి. రెస్టారెంట్ ఉద్యోగినైన తనకు కోట్లలో జీఎస్టీ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. జీఎస్టీ నోటీసులపై అటు మిడుతూరు, ఇటు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించినా ఫిర్యాదు తీసుకోలేదు. ఏమి చేయాలో అర్థంకాక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేందుకు నవీన్ సిద్ధమయ్యాడు. సైబర్ క్రైమ్ పోలీసులు అయినా తనను ఆదుకోవాలని నవీన్ విజ్ఞప్తి చేస్తున్నాడు.
నవీన్ కుమార్ రెడ్డి గతంలో పొగాకు వ్యాపారం చేసి జీఎస్టీ చెల్లించాడు. పొగాకు వ్యాపారంలో నష్టం చవిచూశాడు. వ్యాపారం మానేసిన నవీన్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెస్టారెంట్‌లో పని చేస్తున్నాడు. ఉచితంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తామంటే.. అపరిచిత వ్యక్తిని ఆన్‌లైన్‌లో సంప్రదించాడు. ఆ అపరిచిత వ్యక్తి ప్రతినెల ఉచితంగా రిటర్న్స్ రెగ్యులర్ చేశాడు. ఆ తరువాత నవీన్ రెడ్డి పేరు మీద బంగారు వ్యాపారం చేసి జీఎస్టీ ఎగ్గొట్టాడు. జీఎస్టీ చెల్లించాలని నవీన్ రెడ్డికి సెంట్రల్ జీఎస్టీ అధికారులు నోటీసులు పంపారు. రూ.4.60 కోట్లు జీఎస్టీ చూసి అతడు షాక్ అయ్యాడు.
Also Read: Crime News: ప్రియుడి ఇంటిముందు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం.. సగం కాలిన దేహంతో..!
నవీన్ కుమార్ రెడ్డి జరిగిన మోసాన్ని సెంట్రల్ జీఎస్టీ అధికారులకు వివరించాడు. జరిగిన మోసంపై కంప్లైంట్ చేసేందుకు బాధితుడు మిడుతూరు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నందున అక్కడే ఫిర్యాదు చేయాలని మిడుతూరు పోలీసులు చెప్పారు. హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. మిడుతూరులోనే ఫిర్యాదు చేయాలని చెప్పారు. అటు మిడుతూరు, ఇటు హైదరాబాద్ పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడంతో ఆందోళన చెందాడు. ఏమి చేయాలో అర్థంకాక చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేందుకు నవీన్ సిద్ధమయ్యాడు.
