Group1 Ranker Mother: హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత గ్రూప్-1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు.. తమపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. గ్రూప్-1పై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని.. ఒక్కో పేరెంట్ రూ.3 కోట్లు పెట్టి పోస్టులు కొన్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు.. మాలో కొందరికి కూటికి కూడా గతి లేదు.. కష్టపడి, పస్తులుండి అప్పులు చేసి పిల్లలను చదివించామని వాపోయారు.. సమాజం పట్ల చిన్న చూపు చూసే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ తల్లి తన ఆవేదన వ్యక్తం చేశారు.
“నా కొడుకు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. అనుకోని కారణాల వల్ల పరీక్ష రాయలేక పోయాడు. గ్రూప్1 నోటిఫికేషన్ పడ్డప్పుడు.. గ్రూప్ 1 రాయమని మేము చెప్పాము. నేను యూపీఎస్పీకే ప్రిపేర్ అవుతానన్నాడు. కానీ.. ఈ పరీక్ష కూడా రాయమని చెప్పాం. మా మాట మన్నించి కష్టపడి రాశాడు. అనుకున్న ఫలితం సాధించాడు. ఈ ఫలితం ఊరికే రాలేదు. నాలుగు గోడవ మధ్య కూర్చొని రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి చదివాడు. ఈ జర్నీలో వాడి నాన్నని కూడా కోల్పోయాడు. అయినా కూడా ఎప్పటికీ వెనకడుగు వేయలేదు. నాన్న కలను ఎలాగైనా తీరుస్తాను మమ్మీ అని చెప్పి కష్టపడి ర్యాంకు సాధించాడు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు వాడి భవిష్యత్తు అందకారంలో పడింది. ఇది మా కుటుంబ సమస్యే కాదు. ఇక్కడున్న అన్ని కుటుంబాల సమస్య. ఒక్కసారి ఆలోచించండి. నా కొడుకు ఎప్పుడూ ఏ లగ్జరీ లైఫ్ కోరుకోలేడు. బుక్స్ మధ్యలోనే ఉండి ఎన్నో త్యాగాలు చేశాడు. అన్ని చేసి ఇప్పుడు దోషిలాగా నిలబడ్డాడు. ఇది ఎంతవరకు కరెక్ట్. దీనికి ఎవరు జవాబు చెబుతారు. రూ. 3 కోట్లు అంటున్నారు. ఛీటింగ్ అంటున్నారు. అది నిరూపించండి ఫస్ట్. వాళ్లు కష్టపడ్డారు. ర్యాంక్ సాధించారని మేము ప్రూఫ్ చేస్తాం. వాళ్లు ప్రిపేర్ అయిన ప్రతి మెటీరియల్ మా దగ్గర ఉంది. మీరు ఒకరిని ప్రశ్నించే ముందు మీరు ఎంత మట్టుకు కరెక్ట్‌గా ఉన్నారో చూసుకోండి.. పిల్లల్ని తప్పుపట్టకండి. కష్టపడిన పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి.” అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
