భారత ఆటగాడు పృథ్వీ షాను ముంబై రంజీ టీమ్ నుంచి ముంబై క్రికెట్ అసోసియేషన్ తప్పించిన విషయం తెలిసిందే. ఫామ్, ఫిట్‌నెస్, క్రమశిక్షణారాహిత్యం కారణంగానే అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత జట్టుకు దూరమైన పృథ్వీకి.. ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లోనూ చోటు లేకపోవడంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్లిష్ట సమయంలో టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ అతడికి అండగా నిలిచాడు. అథ్లెట్ల కెరీర్‌లో ఒడిదొడుకులు సహజమేనని, వాటికి ఎదురొడ్డి పోరాడాలని సూచన చేశాడు. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ కూడా ఇలాంటి వాటిని ఎదుర్కొన్నాడని ఉదహరించాడు.
పృథ్వీ షాకు ధైర్యం చెబుతూ గ్రెగ్ ఛాపెల్ సోషల్ మీడియాలో ఓ లేఖ రాశారు. ‘పృథ్వీ షా.. ప్రస్తుత నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తెలుసు. ముంబై జట్టులో చోటు లేదు. ఈ సమయంలో ఎవరికైనా నిరుత్సాహం కలగడం సహజమే. అథ్లెట్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురురవ్వడం కామన్. దొరికిన అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకోవాలి. కెరీర్, క్యారెక్టర్లను ఉన్నతంగా మార్చుకోవాలి. నువ్ అండర్ -19 ఆడుతున్నప్పటి నుంచి చూస్తున్నా. అద్భుతమైన టాలెంట్ నీ సొంతం. ఎంతో మంది యువ క్రికెటర్లను చూశా కానీ.. వారిలో లేని స్పెషాలిటీ నీలో ఉంది. నీ క్రికెట్ ప్రయాణాన్ని గమనిస్తున్నా. ఇప్పటికీ నీ నుంచి అత్యుత్తమ ఆటతీరు బయటకు రాలేదు’ అని ఛాపెల్ పేర్కొన్నాడు.
Also Read: Samsung Smartphone: శాంసంగ్ సూపర్ స్మార్ట్‌ఫోన్.. 280 ఎంపీ కెమెరా, 7600 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ!
‘ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప అథ్లెట్లకే కష్టాలు తప్పలేదు. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ కూడా ఇలాంటి వాటిని ఎదురొకొన్నారు. అయితే తన పంథాలో పోరాడి.. విజయం సాధించారు. అందుకే దిగ్గజాలు అయ్యారు. నా కెరీర్‌లోనూ చాలాసార్లు జట్టులో స్థానం కోల్పోయా. నన్ను నేను సమీక్షించుకొని ముందుకు వెళ్లాను. సవాళ్లను, కష్టాలను మనం ఎలా స్వీకరించామనేది అత్యంత కీలకం. తప్పకుండా నువ్వు ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కుతావు. అస్సలు అధైర్యపడొద్దు’ అని పృథ్వీ షాకు ఛాపెల్ దైర్యం చెప్పాడు.