పెద్దలను ఒప్పించి లేదా ఎదిరించి అయినా సరే తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తుంటారు. ఇదే విధంగా ఓ యువతి తను ప్రేమించిన యువకుడిని పెళ్లాడింది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె తండ్రి ఎవరూ ఊహించని పనిచేశాడు. ప్రేమ పెళ్లి తర్వాత కూతురు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి తన కుమార్తెకు పుట్టిన మగ శిశువును కన్న తల్లికి తెలియకుండా వేరొకరికి దత్తత ఇచ్చాడు. అయితే రోజులు గడుస్తున్నా బిడ్డ ఆచూకి తెలియకపోవడంతో ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి శిశువు ఆచూకీ కనిపెట్టారు. ఈ ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగుచూసింది.
Also Read:Siddharth : యంగ్ హీరో యాటిట్యూట్ తో దర్శకులకు తలనొప్పి
అరకు ప్రాంతానికి చెందిన పెట్టెల దివ్య స్వరూప(23) అదే ప్రాంతానికి చెందిన జాన్‌బాబును ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి దివ్య స్వరూప తండ్రి పి.శుక్రకు మొదటి నుంచి ఇష్టం లేదు. వీరిద్దరిని విడదీయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో దివ్య స్వరూప గర్భం దాల్చింది. ప్రసవం కోసం తండ్రి శుక్ర తన కూతురును తీసుకొచ్చుకున్నాడు. ఆమె కేజీహెచ్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ఇది ఇష్టంలేని ఆమె తండ్రి కూతురుకు మాయమాటలు చెప్పి మగ శిశువును తల్లిదండ్రులకు తెలియకుండా వేరొకరికి దత్తతపేరుతో విక్రయించాడు. రెండు నెలలు గడిచాయి. బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో తండ్రిని నిలదీసింది. అతడు సమాధానం చెప్పకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో, సీపీ శంఖబ్రత బాగ్చీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బిడ్డ ఆచూకీ కనుగొని ఆర్‌అండ్‌బీ వద్దనున్న శిశుగృహకు అప్పగించారు.
