టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల రెండో కుమార్తె పుష్పవల్లీతో రాధా నిశ్చితార్థ వేడుక ఆదివారం నరసాపురంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల వారు హాజరై కాబోయే దంపతులను దీవించారు. రాజకీయాలకు అతీతంగా నిశ్చితార్థ వేడుకకు పలువురు హాజరయ్యారు. ప్రభుత్వ చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Read Also: Margani Bharat: నారా లోకేష్‌పై ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు
వంగవీటి రాధా, పుష్పవల్లిల వివాహం అక్టోబరు 22వ తేదీ సాయంత్రం 7 గంటలకు జరిపించేందుకు ముహుర్తం నిర్ణయించారు. కాగా, రాధా ఓ ఇంటివాడు కానుండడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. వధువు పుష్పవల్లి తల్లి జక్కం అమ్మాని 1987 నుంచి 92 వరకు నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా పని చేశారు. పుష్పవల్లి నరసపురం, హైదరాబాద్ లో చదువుకున్నారు. అనంతరం హైదరాబాద్ లో యోగా టీచర్ గానూ పనిచేసినట్లు సమాచారం. మరోవైపు రాధా గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని ప్రచారం జరుగుతోంది.
Read Also: TS Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
వంగవీటి రాధా 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2009లో ప్రజారాజ్యం నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం వైసీపీలో చేరిన రాధాకృష్ణ.. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి మరోసారి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ టీడీపీ అభ్యర్థి తరుఫున ప్రచారం చేశారు. గత ఎన్నికల ఫలితాల అనంతరం వంగవీటి రాధా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవలే నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆయన కనిపించారు.