Graham Thorpe Death: ఇంగ్లండ్ మాజీ బ్యాటర్, కోచ్ గ్రాహం థోర్ప్ కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న థోర్ప్.. ఆదివారం ఆర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్‌కు ఎక్స్ వేదికగా నివాళులు అర్పించింది. ఈ రోజు ప్రపంచ క్రికెట్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని, గ్రాహం థోర్ప్ మరణ వార్తను బరువెక్కిన హృదయాలతో మీతో పంచుకుంటున్నామని పేర్కొంది.
గ్రాహం థోర్ప్ 1993-2005 కాలంలో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 6744 రన్స్ చేయగా.. ఇందులో 16 సెంచరీలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 200 నాటౌట్. ఇక వన్డేల్లో 2380 పరుగులు చేయగా.. ఒక సెంచరీ కూడా లేదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 341 మ్యాచ్‌ల్లో 21,937 పరుగులు చేశారు. థోర్ప్ అతని తరంలో అత్యుత్తమ బ్యాటర్‌గా కొనసాగారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన థోర్ప్.. సర్రేతో 17 ఏళ్ల కెరీర్‌ను కొనసాగించారు.
Also Read: Neeraj Chopra: రేపే క్వాలిఫికేషన్ రౌండ్.. ‘గోల్డ్’ ఆశలు నీరజ్ చోప్రా పైనే! భారత్ నుంచి మరో ప్లేయర్
రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్‌గా గ్రాహం థోర్ప్ బాధ్యతలు చేపట్టారు. కొంతకాలం బ్యాటింగ్ కోచ్‌గా కూడా ఆయన పని చేశారు. 2022 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ ఘోర ఓటమి (0-4) అనంతరం బ్యాటింగ్ కోచ్‌గా తప్పుకున్నారు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యారు. కానీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే అనారోగ్యం బారినపడ్డారు. చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.