NTV Telugu Site icon

Education Ministry Rule: ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు ఆరేళ్లు ఉండాల్సిందే.. కేంద్రం కొత్త రూల్!

New Education Policy

New Education Policy

Education Ministry Rule: పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు కనీసం ఆరేళ్ల వయసు ఉండాలనే నిబంధనను పక్కాగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కనీసం ఆరేళ్ల ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని.. ఈ నిబంధన అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన విద్యా విధానంలో ఈ మేరకు నిబంధన ఉన్న విషయాన్ని విద్యాశాఖ గుర్తు చేసింది.

ఆ నిబంధన ప్రకారం మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫౌండేషన్‌ స్టేజ్‌లో భాగంగా విద్య నేర్పాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఇందులో మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించేలా ప్రీ-స్కూల్ విద్య ఉంటుందని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఆ తర్వాత ఒకటి, రెండో తరగతులు ఫౌండేషన్ దశలో ఉంటాయి. అయితే ఒకటో తరగతిలో చేరే ముందే.. చిన్నారులకు నాణ్యమైన ప్రీస్కూల్ విద్య అందేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర విద్యా శాఖ సీనియర్ అధికారి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వయసు నిబంధనను నూతన విద్యా విధానానికి అనుగుణంగా మార్చుకోవాలని స్పష్టం చేశారు. దేశ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది.

Read Also: Indians Foreign Travel: విదేశీ టూర్లపై భారతీయులు భారీగా ఖర్చు.. లెక్కలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ఈ నూతన విద్యావిధానంలో బట్టి చదువులకు స్వస్తి పలికి సృజనాత్మకతకు పెద్ద పీట వేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ విధానాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఉన్నత విద్య తీరుతెన్నులను మార్చేసింది. ఇప్పటివరకు విద్యా విధానం 10+2+3గా ఉండగా.. దాన్ని 5+3+3+4గా మార్చింది. ఆర్ట్స్​, సైన్స్​ విద్య మధ్య విభజనలు లేకుండా నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకునే వెసులుబాటును కల్పించేలా నూతన విద్యా విధానాన్ని రూపొందించింది. . జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లోనూ ప్లేస్కూల్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. సమగ్ర శిక్షా అభియాన్ 2.0 కింద ప్లేస్కూల్స్​ ఏర్పాటు చేసి, అందుకోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

Show comments