NTV Telugu Site icon

Agriculture: కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామీణ పరిశ్రమల కోసం వ్యవసాయ నిధి ఏర్పాటు!

Agrisure

Agrisure

Agriculture: మీరు గ్రామంలో ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా స్టార్టప్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే, మీలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి ఏదైనా స్టార్టప్ పెట్టాలనుకునే వారికీ సహకరించడం కోసం 750 కోట్ల రూపాయలతో ఫండ్ ఏర్పాటు చేస్తోంది. మారుతున్న వ్యవసాయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన పథకాలను ప్రారంభించబోతోంది. ఇందులో కొత్త స్టార్టప్‌లు, వ్యవసాయ రంగంలో పని చేస్తున్న పారిశ్రామిక వేత్తలకు ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం సహాయం చేయనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయనుంది. ఇందులో అగ్రిసూర్ పేరుతో రైతుల కోసం వ్యవసాయ నిధిని కేంద్ర సర్కారు సృష్టించనుంది. దీనిని ‘అగ్రికల్చర్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్‌ప్రైజెస్’గా పిలుస్తారు. తొలిదశలో రూ.750 కోట్ల నిధుల ద్వారా రైతులు తమ వ్యవసాయాన్ని మెరుగుపరిచేందుకు, వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు వినియోగిస్తారు.

Read Also: Punjab: పంజాబ్లో ఆయుధ స్మగ్లింగ్ రాకెట్ను ఛేదించిన పోలీసులు..

గ్రామీణ పరిశ్రమల కోసం వ్యవసాయ నిధిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇది కాకుండా, వ్యవసాయం, సంబంధిత రంగాలలో పనిచేస్తున్న వారికి స్టార్టప్‌కు సహకారం అందించడం ద్వారా దానిని ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి సన్నాహాలు చేశారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం, ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి ద్వారా వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, వాటి స్థిరత్వం పెరుగుతాయి. ఇదే జరిగితే వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. రైతులు కూడా నేరుగా దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇటీవల జరిగిన నేషనల్ అగ్రికల్చర్ బోర్డ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) కీలక భేటీలో అధికారులు దీనికి సంబంధించి చర్చలు జరిపారు. నాబార్డు చైర్మన్ షాజీ కేవీ మాట్లాడుతూ.. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పుడైతే ఉపయోగించుకుంటారో అప్పుడే వ్యవసాయాభివృద్ధిలో మరెన్నో ముందడుగులు వేస్తారన్నారు. ఇది నేరుగా రైతులకే కాకుండా వ్యవసాయ పారిశ్రామికవేత్తలతో పాటు దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.