Site icon NTV Telugu

Andhra Pradesh: టీచర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం..

Teacher

Teacher

Andhra Pradesh: ప్రభుత్వ టీచర్లకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పటికే మండలానికి ఒక బాలికల జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేసిన సర్కార్‌.. ఇప్పుడు ఆయా కాలేజీల్లో బోధనకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు దాదాపు 7 వేల మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జీటీ)కు పదోన్నతి కల్పించి హైస్కూల్‌ స్థాయిలో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా నియమించేందుకు సిద్ధం అయ్యింది.. ఈ ప్రక్రియను మే నెలాఖరులోగా పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.. కాగా, గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌ స్థాయికి పెంచుతూ ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే కాగా.. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), జూనియర్‌ కళాశాలలు లేనిచోట ‘ప్లస్‌’ స్కూళ్లను గుర్తించి బాలికలకు ఇంటర్మీడియెట్‌ విద్యాబోధన ప్రారంభించారు.

రాష్ట్రంలో విద్యా వ్యస్థలను కీలక మార్పులు తీసుకొచ్చింది వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. ఈ క్రమంలో 2022–23 విద్యా సంవత్సరంలో 177 ప్లస్‌ హైస్కూల్స్‌లో ప్రవేశాలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన 115 ‘ప్లస్‌’ స్కూళ్లలోనూ ఇంటర్‌ తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.. దీంతో అన్నిచోట్లా పూర్తి స్థాయి బో­ధన సిబ్బందిని నియమించే ప్రక్రియకు పూనుకుంది. 2023–24 విద్యా సంవత్సరంలో జూన్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం కానుండగా.. ప్రస్తుత గణాంకాల ప్రకారం హైస్కూల్‌ ప్లస్‌ స్థాయిలో ఇంటర్‌ తరగతుల బోధనకు 1,752 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు అధికారులు.. అందులో ఎంపీసీ, బైపీసీ, కామర్స్, ఆర్ట్స్‌ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు అవసరం పడనున్నట్టు లెక్కలు తేల్చారు.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సేవలందిస్తున్న స్కూల్‌ అసిస్టెంట్ల(ఎస్‌ఏ)లో సీనియారిటీతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) అర్హతలున్నవారిని హైస్కూల్‌ ప్లస్‌లో నియమించేందుకు సిద్ధం అయ్యారు.

Exit mobile version