Google Maps Misguide: ఒకప్పుడు ఓ కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే కచ్చితంగా తోటి వారిని ఆ అడ్రస్ అడిగి వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్ అనేది రావడంతో ప్రతిదానికి దానిమీదే ఆధారపడటం అలవాటు అయ్యింది. ఈ అలవాటు నిజంగా ఆ నలుగురి కొంప ముంచింది. వాళ్లు నలుగురు ఫ్రెండ్స్.. ఒక కారులో గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్తున్నారు. వాస్తవానికి వాళ్లు వెళ్లాల్సిన చోటుకు వారికి దారి తెలియదు. దీంతో గూగుల్ ఏ రూట్ చెప్తే ఆ వైపుకు పోనిచ్చారు. కట్ చేస్తే కారు చెరువులో పడింది. వాళ్లు చెరువులో పడ్డారు. వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారో లేదో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: SSMB 29: టైటిల్ కోసం రంగంలోకి అవతార్ డైరెక్టర్?
అదృష్టమంటే ఆ నలుగురిదే..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి నలుగురు స్నేహితులు కారులో అంబాలలోని షహాబాద్ పట్టణం మహర్షి మార్కండేశ్వర్ ఆలయానికి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వారిలో ఎవరికి కూడా మహర్షి మార్కండేశ్వర్ ఆలయానికి దారి తెలియదు. దీంతో గూగుల్ మ్యాప్స్ సహాయంతో ముందుకు వెళ్తున్నారు. ఊహించని విధంగా వారి కారు చెరువులో పడిపోయింది. అదృష్టవశాత్తూ ఆ నలుగురు స్నేహితులు కిందమీద పడి ఏదో విధంగా చెరువులో నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. తరువాత వాళ్లు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా వాళ్లు చెరువులో పడ్డ కారును బయటకు తీస్తున్నారు.
మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి నాయకుడు సూర్య తన స్నేహితులు ఆదిత్య, అనుజ్ అశుతోష్‌లతో కలిసి కారులో షహాబాద్ పట్టణంలోని మహర్షి మార్కండేశ్వర్ ఆలయాన్ని దర్శించుకోడానికి వెళ్తున్నారు. తెలియని దారి కావడంతో గూగుల్ మ్యాప్స్ సాయంతో ముందుకు వెళ్తుంటే ఒక్కసారి వారి కారు చెరువులో పడిపోయింది. వెంటనే వాళ్లు కారు అద్దాలను ధ్వంసం చేసుకొని చెరువులో నుంచి బయటపడ్డారు.
బయటపడిన తర్వాత వాళ్లు.. విషయాన్ని డయల్ 112కు, మాజీ ఎంపీ ప్రదీప్ చౌదరికి తెలియజేశారు. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు మాట్లాడుతూ.. నలుగురు యువకులు సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా తప్పుదారిలో వెళ్లడంతో కారు చెరువులో పడిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు.
READ MORE: Shubhanshu Shukla: అంతరిక్ష కేంద్రం నుంచి భారత్ అందంగా కనిపించింది: శుభాంషు శుక్లా
