Golden Gang Arrest: హైదరాబాద్‌లో సినీఫక్కీలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. తక్కువ ధరకే బంగారం అంటూ మోసం చేసిన కొంత మందిని మరికొందరు మోసం చేయడంతో ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి.
సికింద్రాబాద్‌లోని ఆర్‌కే జ్యువెలరీ యజమానికి .. రాధేశ్యామ్, రాంబాబు అనే కేటుగాళ్లు తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించారు. కోటి రూపాయల బంగారం రూ. 50 లక్షలకే ఇస్తామని చెప్పడంతో హరిరామ్ అనే వ్యాపారి బుట్టలో పడ్డాడు. కిలో బంగారం ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నాడు. ఐతే కాస్త అనుమానంతో నగలు చూపించాలని కోరాడు. వారు కొంత బంగారం చూపించడంతో అంతా నిజమేనని నిర్ధారించుకున్నాడు. ఈ లోగా క్యాష్ చూపించాలని కోరారు కేటుగాళ్లు. సేటు.. క్యాష్ బయటకు తీయగానే సరిగ్గా అదే సమయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
Read Also:Drugs Federals: డ్రగ్ పెడ్లర్ గేమ్ ఓవర్.. డ్రగ్స్ దందా ముఠా అరెస్ట్..!
కొంత మంది వ్యక్తులు తాము SOT పోలీసులం అంటూ రంగంలోకి దిగారు. వ్యాపారిని బెదిరించి రూ. 45 లక్షల డబ్బు సీజ్ చేస్తున్నామని చెప్పి కారులో తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో కొంత మంది కారులో వెళ్లగా.. మరో ఇద్దరు బైక్‌పై వెళ్లారు. డబ్బు తీసుకుని వెళ్తున్న బైక్ వ్యక్తులకు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర మరో ట్విస్ట్ ఎదురైంది. ఈ సమయంలో వారిని కొంత మంది రికవరీ ఏజెంట్లు అడ్డగించారు. బండిపై ఈఎమ్ఐ ఉండడంతో బండిని స్వాధీనం చేసుకున్నారు. అందులో డబ్బు ఉన్నది చూసి.. వారిద్దరినీ బెదిరించారు. బండితోపాటు డబ్బు కూడా తీసుకుని పరారయ్యారు.
Read Also:Gadwal Surveyor Murder: సర్వెయర్ తేజేశ్వర్ హత్య.. ట్విస్టుల మీద ట్విస్టులు..!
ఇక ముఠా చేతిలో మోసపోయానని గ్రహించిన బాధితుడు హరిరామ్ గుప్తా వెంటనే క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 100 సీసీ ఫుటేజీలు పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రాధేశ్యామ్, రాంబాబు కొంత మంది వ్యక్తులతో కలిసి వ్యాపారిని చీట్ చేసేందుకు ప్రయత్నించారు. SOT పోలీసుల పేరుతో బురిడీ కొట్టేంచేందుకు చూశారు. వారిని రికవరీ ఏజెంట్లు దోచుకోవడంతో ఈ కేసులో మరో ట్విస్టు నెలకొంది. ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. మొత్తంగా 24 మంది చుట్టు తిరిగిన ఈ కేసులో పోలీసులు 18 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
