Gold and silver prices: మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX)లో బంగారం, వెండి ధరలు 9 శాతం పడిపోయాయి. వరసగా రెండో రోజు ధరలు దారుణంగా పడిపోయాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే కొన్ని గంటల ముందు ధరలు తగ్గాయి. గ్లోబల్ మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాలు భారత్‌లోనుూ కనిపిస్తున్నాయి. బడ్జెట్‌లో బులియన్ దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా ధరల పతనానికి మరింత బలాన్ని చేకూర్చాయి. గత రెండు రోజుల్లో రెండు లోహాల చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ధరల పతనంగా ట్రేడర్లు పేర్కొంటున్నారు.
Read Also: Union Budget 2026: క్యాపెక్స్, అప్పులు, పన్నులు.. బడ్జెట్‌లో మనం గమనించాల్సిన కీలక పాయింట్స్ ఇవే..
ప్రస్తుతం MCXలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.13,711 తగ్గి, రూ.1,38,634కు చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 26,273 తగ్గి, రూ. 2,25,652గా ఉంది. శుక్రవారం ధరలు 12 శాతం పడిపోయాయి. ఒకానొక దశలో వెండి 37 శాతం కుప్పకూలాయి. 1980 తర్వాత బంగారం ధరలు ఒకే రోజు ఇంతలా పడిపోవడం ఇది మొదటిసారి. వెండి ధరలు చరిత్రలోనే అతిపెద్ద క్షీణతగా రికార్డ్ నమోదైంది.
మరోవైపు, బడ్జెట్ కూడా ధరలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం బంగారం, వెండిపై 6 శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ, 3 శాతం జీఎస్టీ కలిపి మొత్తం 9 శాతంగా ఉండేది. ఇంతకుముందు ఇది మొత్తం 15 శాతం సుంకం ఉండేది. ఇది పెద్ద ఎత్తున స్మగ్లింగ్‌కు దారి తీసింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ డ్యూటీని 6 నుంచి 4 శాతానికి తగ్గించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇదే జరిగితే బంగారం ధర 10 గ్రాములకు రూ. 2000-రూ. 3000 తగ్గే అవకాశం ఉంది. ఇక వెండి కిలో ధర దాదాపుగా రూ. 6000 తగ్గొచ్చు.
