Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్‌ కీలక ఆదేశాలు

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: గోదావరి నది కాలుష్య నివారణ చర్యలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి.. గోదావరి నదిలో వ్యర్థాలు కలిసే స్పాట్లను గుర్తించి.. చర్యలు తీసుకోవాలంటూ సూచించారు.. ఇక, గోదావరి నదిలోకి చేరుతున్న డ్రెయిన్లు, మురుగు, పారిశ్రామిక వ్యర్థాల కాలుష్యంపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని అధికారులను ఆదేశించారు పవన్‌ కల్యాణ్‌.. ప్రతి డ్రెయిన్‌పై నిరంతర పర్యవేక్షణ చేపట్టడంతో పాటు, నీటి నమూనాలను శాస్త్రీయంగా పరిశీలించాలని సూచించారు. గోదావరిలోకి చేరుతున్న వ్యర్థాలపై ప్రత్యేక అధ్యయనం నిర్వహించి, పరిమితికి మించిన కాలుష్యాన్ని నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రతి డ్రెయిన్‌పై నిరంతర పర్యవేక్షణ
గోదావరి పరివాహక ప్రాంతంలో నదిలో కలిసే ప్రతి డ్రెయిన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు. డ్రెయిన్ల నుంచి వచ్చే నీటి నమూనాలను క్రమం తప్పకుండా సేకరించి శాస్త్రీయంగా పరీక్షించాలని, కాలుష్య స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్దేశిత పరిమితులకు మించి కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గోదావరి కాలుష్య నియంత్రణకు ప్రత్యేక పర్యావరణ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ బృందం డ్రెయిన్లను పర్యవేక్షించడం, కాలుష్యానికి కారణాలను గుర్తించడం, నమూనాలను పరిశీలించడం, అవసరమైన నియంత్రణ చర్యలను అమలు చేయడంపై దృష్టి సారించనుంది.

రూ.100 కోట్లతో మురుగు నియంత్రణ చర్యలు
మురుగు, వ్యర్థ జలాలు గోదావరిలో కలవకుండా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు కాలుష్య నియంత్రణ మండలి (PCB) నిధుల నుంచి రూ.100 కోట్లను వినియోగించాలని డిప్యూటీ సీఎం సూచించారు. నదిలోకి నేరుగా మురుగు చేరకుండా అవసరమైన మౌలిక వసతులు, శుద్ధి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాబోయే పుష్కరాల్లో భక్తులు కాలుష్య రహిత గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించేలా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గోదావరి నది పవిత్రతను కాపాడటంతో పాటు పుష్కరాల సమయంలో భక్తులకు పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

గోదావరిలో కలుస్తున్న 60కిపైగా డ్రెయిన్లు
రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపు 15 ప్రధాన డ్రెయిన్లు, 45 వరకు మైనర్ డ్రెయిన్లు నదిలో కలుస్తున్నాయి. వీటి ద్వారా మురుగు, పారిశ్రామిక వ్యర్థ జలాలు గోదావరిలోకి చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డ్రెయిన్ల వారీగా కాలుష్యానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి, సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వం భావిస్తోంది. యనమదుర్రు వంటి డ్రెయిన్లు పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ జలాలను మోసుకెళ్లి వశిష్ట గోదావరిలో కలుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా నదిలోకి చేరకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

పలు ప్రాంతాల మురుగు గోదావరిలోకే
రామచంద్రపురం పరిసర ప్రాంతాల మురుగు టేకి మేజర్ డ్రెయిన్ ద్వారా గోదావరిలోకి చేరుతోంది. అమలాపురం ప్రాంతంలోని వ్యర్థాలు కుమ్మర కాలువ ద్వారా, ధవళేశ్వరం సమీపంలోని వ్యర్థాలు గోరింకల డ్రెయిన్ ద్వారా నదిలోకి చేరుతున్నాయి. ఈ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ చర్యలను ప్రత్యేకంగా చేపట్టాలని ఆదేశించారు. గోదావరి తీరం వెంబడి ఉన్న 262 గ్రామ పంచాయతీల నుంచి వెలువడే మురుగుకు గోదావరి నదే అంతిమ గమ్యస్థానంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాల నుంచి వెలువడే మురుగును శుద్ధి చేసి మాత్రమే నదిలోకి విడుదల చేసే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. డ్రెయిన్లు, గ్రామాలు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి నదిలోకి చేరుతున్న వ్యర్థాలన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసి కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు..