NTV Telugu Site icon

MLC By Election: కాసేపట్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌..

Election

Election

MLC By Election: నేడు ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది.. ఉదయం 8 గంటలకు అంటే కాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.. గత ఎన్నికల్లో యూటీఎఫ్‌ తరఫున గెలిచిన షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.. ఈ ఉపఎన్నికలో 16,737 మంది టీచర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ చేపట్టనున్నారు.

Read Also: Telangana Assembly: ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..

ఇక, ఈ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో ఉండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఐదుగురిలో ఇద్దరి మధ్యే హోరాహోరీ పోటీ నెలకొననుందని అంచనా. హోరాహోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం 4 గంటలతో ముగిసింది. కాకినాడ జిల్లాలో 3418 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 2990, డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 3296, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 637, పశ్చిమగోదావరి జిల్లాలో 3729, ఏలూరు జిల్లాలో 2667 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నిక స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ అధికారులను ఆదేశించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు బొర్రా గోపిమూర్తి (భీమవరం), గంధం నారాయణరావు (ద్రాక్షారామ), నామన వెంకటలక్ష్మి (సామర్లకోట), కవల నాగేశ్వరరావు (రాజమహేంద్ర వరం), పులుగు దీపక్ (తాడేపల్లి గూడెం).. విజయం సాధించినవారు రెండేళ్ల రెండు నెలలు మాత్రమే పదవిలో కొనసాగుతారు.. ఇక, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ విధించారు పోలీసులు..