దసరా పండుగ వేళ మేకలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో దొంగలు వినూత్న రీతిలో చోరీకి పాల్పడ్డారు. పండుగ సందర్భంగా మాంసం విక్రయాల కోసం ఖర్చు లేకుండా లాభపడాలనే దురాశతో దుండగులు ఏకంగా కారులో వచ్చి మేకలను ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్వెల్లిగూడ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ముత్వెల్లిగూడ గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, బుర్ర అశోక్ అనే బాధితులు దసరా పండుగ సందర్భంగా తమ మేకలను, మేకపోతులను విక్రయించి మంచి ఆదాయం పొందవచ్చని ఆశించారు. అయితే, అక్టోబర్ 17వ తేదీన అర్ధరాత్రి వేళ మహీంద్రా కారులో వచ్చిన గుర్తుతెలియని ముఠా, కంటి రెప్పపాటులో మేకలను కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయాన్నే లేచి చూసేసరికి తమ మేకలు కనిపించకపోవడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురై మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు.
పండుగ వేళ కష్టపడి పెంచుకున్న జీవాలు దొంగతనానికి గురికావడంతో బాధితులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొని కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దొంగలు ఉపయోగించిన మహీంద్రా కారు నంబర్ , ప్రయాణించిన మార్గాన్ని ఆధారంగా చేసుకుని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. పండుగ రోజుల్లో పెరిగిన మాంసం డిమాండ్ను ఆసరాగా చేసుకుని ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాల పట్ల జీవాల పెంపకందారులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

