Global Fuel Crisis: మిడిల్ ఈస్ట్‌లో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఘర్షణ ముదరడం, అలాగే హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా తీవ్రమైన ఇంధన సంక్షోభం తలెత్తింది. దీని ప్రభావం వల్ల అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇంధన కొరతతో, రికార్డు స్థాయి ధరలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. అనేక దేశాల్లో డీజిల్ దొరకడమే కష్టమైపోయి, చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూతపడే పరిస్థితికి వచ్చాయి. అమెరికాలో పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. అక్కడ డీజిల్ సగటు ధర గాలన్‌కు $6.49 (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.622) అనే ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరింది. ఈ సంక్షోభం మొదలవ్వకముందు, అంటే ఫిబ్రవరి 27న డీజిల్ ధర గాలన్‌కు $3.75 (సుమారు రూ.360) మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 73 శాతం పెరిగిపోయింది. ఇక కాలిఫోర్నియా రాష్ట్రంలోనైతే పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడ డీజిల్ గాలన్‌కు $8.41 (సుమారు రూ.807) పలుకుతుంటే, పెట్రోల్ ధర $6.13 (సుమారు రూ.588)కి చేరింది. అమెరికాలో లారీలు, గూడ్స్ రైళ్లు, వ్యవసాయ యంత్రాలు.. ఇలా సరుకు రవాణా అంతా డీజిల్‌పైనే ఆధారపడి నడుస్తుంది. దాంతో డీజిల్ ధరలు మంట పుట్టించడంతో అక్కడ సరుకు రవాణా ఛార్జీలతో పాటు నిత్యావసరాల ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.
ఇటు ఫ్రాన్స్‌లో కూడా ఇంధన కొరత ముదిరిపోయింది. ఎంతలా అంటే, అక్కడ ప్రతి తొమ్మిది పెట్రోల్ బంకుల్లో ఒక బంకు (దాదాపు 11 శాతం) పూర్తిగా ఖాళీ అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లోనైతే ఏకంగా 16 శాతం బంకుల్లో లీటర్ ఆయిల్ కూడా దొరకడం లేదు. ఫ్రాన్స్‌లో డీజిల్ సగటు ధర లీటరుకు 2.39 యూరోలు (సుమారు రూ.264) దాటి రికార్డు సృష్టించింది. దేశంలోని 700 కంటే ఎక్కువ బంకుల్లో ప్రీమియం గ్రేడ్ ఇంధనం లీటరుకు 2.50 యూరోల (సుమారు రూ.276) నుంచి 2.70 యూరోల (సుమారు రూ.298) వరకు విక్రయిస్తున్నారు. సవూదీ అరామ్‌కోకు చెందిన ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌పై జరిగిన దాడి వల్ల, అక్టోబర్ నెలకు సంబంధించిన క్రూడ్ ఆయిల్ సప్లైని నిలిపివేస్తున్నట్లు కనీసం ఇద్దరు పెద్ద యూరోపియన్ రిఫైనర్లకు సమాచారం అందించారు. ఇది ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసింది. ఈ ఊహించని పరిస్థితి నుంచి బయటపడేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్ జీ-7 దేశాలను తమ దగ్గరున్న అత్యవసర వ్యూహాత్మక చమురు నిల్వలను (ఎమర్జెన్సీ ఆయిల్ రిజర్వ్స్) మార్కెట్లోకి విడుదల చేయాలని కోరారు.
మరోవైపు బ్రిటన్ కూడా ఈ ధరల మంటల్లో చిక్కుకుంది. అక్కడ ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా 3.1 శాతానికి పెరిగింది. దీనికి ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, అలాగే విమాన ప్రయాణ ఛార్జీలు ప్రియం కావడమే. ఆ దేశ జాతీయ గణాంకాల కార్యాలయం (ONS) అందించిన వివరాల ప్రకారం.. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే వాహనాల ఇంధన ధరలు ఏకంగా 23 శాతం పెరిగాయి. జూలై నుంచి ఆగస్టు మధ్యలోనే పెట్రోల్ సగటు ధర లీటరుకు 9.1 పెన్స్ పెరిగి 161.3 పెన్స్‌కు (సుమారు రూ.206) చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంలో నమోదైన రికార్డు ధరల తర్వాత, పెట్రోల్ ధరలు ఈ స్థాయిలో పెరగడం మళ్లీ ఇప్పుడే. ఇక, అసలు ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయిలో ఇంధన సంక్షోభం రావడానికి ప్రధాన కారణం హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో చమురు రవాణా నిలిచిపోవడమే. దీనివల్ల గ్లోబల్ శుద్ధి చేసిన ఇంధన (రిఫైన్డ్ ఫ్యూయల్) మార్కెట్‌పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు రష్యా, మిడిల్ ఈస్ట్‌లోని ప్రధాన రిఫైనరీలు, ఆయిల్ ఎక్స్‌పోర్ట్ మౌలిక సదుపాయాలకు ఆటంకాలు ఏర్పడటంతో డీజిల్ సరఫరా దారుణంగా పడిపోయింది. ఈ రవాణా, ఉత్పత్తి ఆటంకాలకు తోడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో ఇంధన ధరలు సాధారణ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు భారత్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పాడనుందా? ధరలు పెరుగుతాయా? అనే భయం పెరిగింది.

