NTV Telugu Site icon

Glenn Maxwell: పూటుగా తాగి ఆస్పత్రి పాలైన మ్యాక్స్‌వెల్‌.. దర్యాప్తుకు ఆదేశించిన క్రికెట్ ఆస్ట్రేలియా!

Glenn Maxwell

Glenn Maxwell

Glenn Maxwell under investigation by CA: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా అడిలైడ్‌లో రాత్రిపూట పూటుగా మద్యం సేవించిన మాక్స్‌వెల్‌.. అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీరియస్ అయ్యింది. మాక్స్‌వెల్‌ను దర్యాప్తుకు రావాలని సీఏ ఆదేశించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై సీఏ విచారణ జరుపుతోందని తెలుస్తోంది. ఆస్పత్రి పాలైన మ్యాక్స్‌వెల్‌ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని తెలుస్తోంది.

బీబీఎల్‌ 2024లో మెల్‌బోర్న్ స్టార్స్ జట్టుకు గ్లెన్ మాక్స్‌వెల్‌ నాయకత్వం వహించాడు. టోర్నీలో పేలవ ప్రదర్శన చేసిన మెల్‌బోర్న్.. లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఆపై జనవరి 19న రాత్రి అడిలైడ్‌లో ‘సిక్స్ అండ్ అవుట్’ బ్యాండ్‌తో కలిసి మ్యాక్సీ పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో బ్రెట్ లీ వంటి మాజీ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు కూడా ఉన్నారు. పార్టీలో పరిమితికి మించి ఆల్కహాల్‌ తీసుకోవడంతో మాక్స్‌వెల్‌ అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ అయ్యింది.

Also Read: IND vs ENG: పాటిదార్‌, పుజారా కాదు.. విరాట్ కోహ్లీ స్థానంలో కొత్త ఆటగాడికి అవకాశం!

తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం గ్లెన్ మాక్స్‌వెల్‌ను సీఏ పక్కనపెట్టింది. టీ20 సిరీస్ కోసం మాక్సీకి విశ్రాంతి ఇస్తున్నట్లు సీఏ తెలిపింది కానీ.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతడిపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అంతకుముందు మాక్స్‌వెల్ తన స్నేహితుడి బర్త్‌ డే పార్టీలో కాలుజారి కిందపడ్డాడు. దీంతో అతని కాలు విరిగింది. దూకుడు ఆటతీరుకు మ్యాక్సీ పేరుగాంచాడు. ప్రపంచకప్ 2023 విజయంలో మ్యాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.