Glenn Maxwell Retirement: కాలికి గాయమైనా వీరోచిత పోరాటం.. వరల్డ్ కప్‌లో మాక్స్‌వెల్ 201 పరుగుల ఇన్నింగ్స్..

Glenn Maxwell Retirement

Glenn Maxwell Retirement

Glenn Maxwell Retirement: క్రికెట్ ప్రపంచంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు ముచ్చమటలు పట్టించిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 38 ఏళ్ల మాక్స్‌వెల్ ఒక్కసారిగా తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేసింది. నిజానికి 2028 టీ20 వరల్డ్ కప్, లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా తరఫున ఆడాలని ఆయన భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ కెరీర్‌కు పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా మ్యాక్స్‌వెల్‌కు సంబంధించిన క్రికెట్ ప్రపంచం మరిచిపోలేని ఇన్నింగ్స్‌ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. గాయం అయి.. ఆడలేని పరిస్థితి వచ్చినా మ్యాక్స్‌వెల్ చివరి వరకు క్రీజ్‌లోనే ఉండి మ్యాచ్ గెలిపించిన తీరును అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అదే.. 2023 వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్‌పై ఆడిన నాటౌట్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో 2023 వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఈ మ్యాచ్‌లో కేవలం 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓటమి ఖాయమనుకున్న సమయంలో మాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. కాళ్ల కండరాల నొప్పులు (క్రాంప్స్), తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ మైదానంలో పట్టుదలగా నిలబడి అఫ్గాన్ బౌలర్లను ఉతికిపారేశాడు. కేవలం 128 బంతుల్లోనే 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో వన్డే క్రికెట్ చరిత్రలో బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా ఇది నిలిచింది. అదే వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

అంతేకాదు.. మూడు ఫార్మాట్లలోనూ మాక్స్‌వెల్ తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో 7 మ్యాచ్‌లు ఆడి 339 పరుగులు (ఒక సెంచరీ, అత్యధిక స్కోరు 104) చేయగా, 8 వికెట్లు పడగొట్టారు. ఇక 149 వన్డేల్లో 3990 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి. 126.70 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిన ఆయన, వన్డేల్లో 77 వికెట్లు కూడా తీశాడు. 2015, 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అలాగే 130 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడిన మాక్స్‌వెల్ 154.42 స్ట్రైక్ రేట్‌తో 2897 పరుగులు చేశాడు. ఈ టీ20 ఫార్మాట్‌లో ఆయన పేరిట 5 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో పాటు 51 వికెట్లు ఉన్నాయి. ఇక,అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాక్స్‌వెల్ ఆడుతూనే ఉంటాడా లేదా అనేదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.