Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..

Gig Workers

Gig Workers

Gig Workers Strike: దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ ‘గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్’ (GIPSWU) శనివారం మరోసారి ఐదు గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 12:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు గిగ్ కార్మికులందరూ తమ యాప్‌లను ఆఫ్‌లైన్‌లో ఉంచనున్నారు. దీనివల్ల స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల సేవలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేసే ప్రజలకు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.3 వరకు పెరగడంతో, దానికి అనుగుణంగా కిలోమీటర్ సర్వీస్ రేట్లను తక్షణమే పెంచాలని అటు ప్రభుత్వం, ఇటు డిజిటల్ ప్లాట్‌ఫామ్ యాజమాన్యాలను GIPSWU శుక్రవారం డిమాండ్ చేసింది. ఇంధన ధరల పెరుగుదల తమను మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోందని యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. నిత్యం రోడ్లపై తిరిగే వేలాది మంది డెలివరీ భాగస్వాములు, డ్రైవర్లు.. పెరిగిన ఇంధన ఖర్చుల వల్ల జేబుల నుంచి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని, దీనివల్ల రోజంతా కష్టపడినా ఇంటికి తీసుకెళ్లే ఆదాయం మాత్రం చాలా తగ్గిపోతోందని వారు పేర్కొన్నారు. మోటార్ సైకిళ్లు, స్కూటర్లపైనే ఆధారపడి రోజువారీ జీవనం సాగించే దేశంలోని దాదాపు 1.2 కోట్ల మంది గిగ్ కార్మికులపై ఈ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతుందని యూనియన్ హెచ్చరించింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, తీవ్రమైన వేసవి ఎండలతో సతమతమవుతున్న కార్మికులకు ఈ ఇంధన ధరల పెంపు “నేరుగా తగిలిన దెబ్బ” అని GIPSWU ప్రెసిడెంట్ సీమా సింగ్ అభివర్ణించారు. పెరిగిన ఇంధన, మెయింటెనెన్స్ ఖర్చులకు అనుగుణంగా తమ ఆదాయం పెరగకపోతే, చాలా మంది కార్మికులు ఈ రంగాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.

ముఖ్యంగా గిగ్ రంగంలో ఉన్న మహిళా కార్మికులు, డెలివరీ సిబ్బంది, డ్రైవర్లు అత్యంత దారుణంగా ప్రభావితమవుతున్నారని.. తీవ్రమైన ఎండలు, భారీ ట్రాఫిక్ వంటి కఠినమైన పరిస్థితుల్లో వీరంతా రోజుకు 10 నుండి 14 గంటల పాటు శ్రమిస్తున్నారని యూనియన్ పేర్కొంది. ఈ సమస్యపై సవరించిన డెలివరీ రేట్లు, ఇంధన పరిహారం (ఫ్యూయల్ కాంపెన్సేషన్) ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం, ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు తాము ఇప్పటికే మెమోరాండంలను సమర్పించామని GIPSWU తెలిపింది. దేశవ్యాప్తంగా గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికులు ఎదుర్కొంటున్న జీవనోపాధి సంక్షోభంపై అందరి దృష్టిని ఆకర్షించేందుకే ఈ రోజు శాంతియుత నిరసనగా ఈ యాప్‌ల బంద్‌కు పిలుపునిచ్చినట్లు యూనియన్ స్పష్టం చేసింది.