Site icon NTV Telugu

హైదరాబాద్‌ వాసులకు జీహెచ్ఎంసీ షాక్‌ !

హైదరాబాద్‌లో పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టిసారించింది. ప్రాపర్టీ ట్యాక్సులు కట్టకపోతే బిల్డింగులు సీజ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. గత ఏడాదిలో వసూలైన పన్నుల కంటే అధికంగా రాబట్టాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో..ఆస్తి పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్న బకాయిదారులపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. ట్యాక్స్ చెల్లించకుంటే భవనం సీజ్‌ చేస్తామని హెచ్చరిస్తూ రెడ్‌ వారెంట్‌ జారీ చేయనుంది. ఆస్తి పన్ను ఎగ్గొడుతూ, పన్ను కట్టకున్నా ఏం కాదులే అనుకునే వారికి ఈ నిర్ణయంతో..GHMC షాక్ ఇచ్చింది.

2021-22 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ట్యాక్స్ వసూళ్లను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 250 కోట్లు తక్కువ పన్ను వసూలు కావడంతో పన్నుల వసూలు విషయంలో సంస్థ కఠినంగా వ్యవహరించనుంది. ఆర్థిక అవసరాలు, ఉన్నతస్థాయి ఆదేశాలతో ముందుగానే వారెంట్‌ల జారీకి అధికారులు శ్రీకారం చుట్టారు. నివాసేతర కేటగిరీ భవనాలకు సంబంధించి లక్షలు, కోట్లలో బకాయి ఉన్న వారిని గుర్తించి రెడ్‌ వారెంట్‌ జారీ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ చట్టం 1955 సెక్షన్‌ 271 ప్రకారం ట్యాక్స్ బకాయి వెంటనే చెల్లించాలని, లేకపోతే ఆస్తులు జప్తు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఖైరతాబాద్‌, ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి తదితర సర్కిళ్లలో టాక్స్ చెల్లించని వారు ఎక్కువగా ఉన్నారని అంచనా. గ్రేటర్‌ హైదరాబాద్‌లో దాదాపు 18 లక్షలకు పైగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది లక్షల మంది మాత్రమే పన్ను చెల్లించారని తెలుస్తోంది. ఇక ఆరు నెలల్లో దాదాపు 887 కోట్ల పన్ను వసూలైంది.

2020-21 ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ చివారినాటికి 1,122 కోట్లు వసూలు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 245 కోట్ల పన్ను వసూలు తగ్గింది. తగ్గిన పన్నును మళ్ళీ రాబట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బకాయిదారులకు రెడ్‌ వారెంట్‌ నోటీసులు జారీ చేసి పన్ను వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. ఐతే…బకాయిలు వెంటనే చెల్లించని క్రమంలో రెండు శాతం పెనాల్టీ విధిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు పన్ను చెల్లింపునకు అవకాశముంటుంది. మొదటి అర్ధ సంవత్సరం అంటే ఏప్రిల్‌-సెప్టెంబర్‌ పన్ను జూన్‌ నెలాఖరుకు, రెండో అర్ధ సంవత్సరం పన్ను డిసెంబర్‌ నాటికి చెల్లించాలి. గడువులోపు చెల్లించని పక్షంలో రెండు శాతం పెనాల్టీ విధిస్తారు. మరోవైపు..కరోనాతో ఆర్థికంగా కొంత ఇబ్బంది ఏర్పడిందని మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు ట్యాక్స్ చెల్లింపుదారులు. మొత్తానికి…గత ఆర్థిక సంవత్సరంలో కంటే తక్కువగా వచ్చిన మొత్తాన్ని GHMC వసూలు చేయాలని చూస్తోంది.

Exit mobile version