Site icon NTV Telugu

RV Karnan: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ స్పష్టీకరణ… అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకుంటాం..!

Rv Karnan

Rv Karnan

RV Karnan: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సమగ్ర వివరణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధి గతంలో 650 చదరపు కిలోమీటర్లుగా ఉండగా, ప్రస్తుతం 2060 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందని తెలిపారు. ఈ విస్తరణతో దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ మారిందన్నారు. వార్డుల విభజన ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు సమగ్రంగా ఎక్సర్సైజ్ చేసి రూపొందించారని కమిషనర్ వివరించారు. గతంలో ఔటర్ పరిధిలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ ఇలా నాలుగు రకాల పాలనా వ్యవస్థలు ఉండేవని.. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకే జీహెచ్ఎంసీగా మార్చామని తెలిపారు.

Kishan Reddy: లోపల జరిగిందొకటి, బయట ప్రచారం చేసింది ఒకటి.. కేంద్రమంత్రి సీరియస్..!

20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన అనంతరం వార్డుల విభజన చేపట్టామని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియను డిసెంబర్ చివరికి పూర్తి చేస్తే రాబోయే జనగణనకు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం సూచించిందన్నారు. కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఇచ్చే ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు ఇవ్వడానికి రేపు చివరి రోజని తెలిపారు. వార్డుల విభజనలో నాలాలు, ప్రధాన రహదారులు, రైల్వే లైన్లు వంటి నాచురల్ బౌండరీలను ప్రతిపాదికగా తీసుకున్నామని చెప్పారు. అలాగే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న వార్డులను ఒకే నియోజకవర్గానికి తీసుకురావడమే లక్ష్యంగా పని చేశామని వివరించారు.

తెల్లాపూర్ ప్రాంతాన్ని ఉదాహరణగా పేర్కొన్న కమిషనర్.. ప్రస్తుతం అక్కడ సుమారు 23 వేల జనాభా మాత్రమే ఉన్నప్పటికీ, రాబోయే ఐదేళ్లలో నాలుగు లక్షలకు పైగా జనాభా పెరిగే అవకాశం ఉందన్నారు. పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉన్నందున, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ వార్డుల సంఖ్యను పెంచామని తెలిపారు. వార్డుల పేర్ల మార్పుపై ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయని, కొన్ని ప్రాంతాల్లో బౌండరీలపై కూడా అభ్యంతరాలు నమోదయ్యాయని కమిషనర్ తెలిపారు. జోన్ల విభజన ఇంకా పూర్తికాలేదని, ప్రస్తుతం తాత్కాలికంగా సమీప మున్సిపాలిటీలను వివిధ జోన్లలో కలిపామని చెప్పారు. ప్రతి అభ్యంతరాన్ని సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

SIT Interrogation: ఐదవ రోజుకు సిట్ విచారణ.. హాజరైన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు

కొన్ని వార్డుల్లో ప్రస్తుతం జనాభా తక్కువగా ఉన్నా, భవిష్యత్‌లో జనాభా పెరిగే అవకాశాలను పరిగణనలోకి తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. ఈసారి జరిగే కౌన్సిల్ సమావేశానికి చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ ఎమ్మెల్యేలకూ ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తున్నందున వారి సూచనలు కూడా కీలకమని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version