Site icon NTV Telugu

Ghaziabad to be Renamed: ఘజియాబాద్ పేరు మార్చే ప్రతిపాదనకు ఆమోదం!

Ghaziabad

Ghaziabad

Ghaziabad to be Renamed: ఘజియాబాద్ పేరు మార్చే ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. హర్నంది నగర్, గజ్ ప్రస్థ, దూధేశ్వరనాథ్ నగర్ అనే మూడు పేర్లను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పంపనున్నట్లు ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) మేయర్ సునీతా దయాల్ వెల్లడించారు. అయితే, అటువంటి పేరు మార్పుకు అంతిమంగా కేంద్రం ఆమోదం అవసరం. ఘజియాబాద్ పేరును మార్చే ప్రతిపాదనను పూర్తి మెజారిటీ కౌన్సిలర్లు ఆమోదించారని, కొత్త పేరును సీఎం నిర్ణయిస్తారని మేయర్‌ సునీతా దయాళ్ చెప్పారు. ఘజియాబాద్ ప్రజలు, హిందూ సంస్థల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని పేర్లు సూచించబడ్డాయని మేయర్ చెప్పారు.

Read Also: Lakshadweep vs Maldives: మాల్దీవులు, లక్షద్వీప్ మధ్య తేడా, ఏది ఎంత ప్రత్యేకం?

సాహిబాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ మాట్లాడుతూ.. ఘజియాబాద్‌కు గజ్ ప్రస్థగా పేరు మార్చాలని సూచిస్తూ గత సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీలో దీనికి సంబంధించిన ప్రతిపాదనను సమర్పించామన్నారు. ఇదిలా ఉండగా, దూధేశ్వర్ నాథ్ ఆలయ ప్రధాన పూజారి మహంత్ నారాయణ్ గిరి మాట్లాడుతూ, గత సంవత్సరం ముఖ్యమంత్రికి మూడు పేర్లను సూచించినట్లు చెప్పారు. గిరి ప్రకారం, ప్రస్తుత ఘజియాబాద్ హస్తినాపూర్‌లో భాగంగా ఉన్నందున ఈ పేర్లు మహాభారతానికి సంబంధించినవి. ఈ ప్రాంతం హిందీలో ‘గజ్’ అని పిలువబడే ఏనుగులు నివసించే దట్టమైన అడవి. అందుకే ఘజియాబాద్‌ను గజ్ ప్రస్థ అని పిలుస్తున్నారని గిరి పేర్కొన్నారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ సన్నిహితుడు ఘజియుద్దీన్ పేరును ఘజియాబాద్‌గా మార్చాడని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version