Site icon NTV Telugu

GG W vs MI W: హర్మన్‌ప్రీత్ హాఫ్ సెంచరీతో ముంబై ఘన విజయం.. గుజరాత్‌కు తొలి ఓటమి..!

Gg W Vs Mi W

Gg W Vs Mi W

GG W vs MI W: మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) విజయం సాధించింది. సీజన్ తొలి మ్యాచ్‌లో చివరి బంతికి ఓటమి ఎదురైనా, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ముంబై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మూడో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ (GG)పై 7 వికెట్ల తేడాతో గెలిచి తమ సత్తా చాటింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 70కి పైగా పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ ఓటమితో గుజరాత్‌కు ఈ సీజన్‌లో తొలి పరాజయం ఎదురైంది.

Anil Ravipudi : మెగా ఫాన్స్ నన్ను లాక్కెళ్ళి ముద్దు పెట్టాలని చూశారు

జనవరి 13న డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో 200కి పైగా స్కోర్లు చేసిన గుజరాత్ ఈసారి 192 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఎవరూ అర్ధసెంచరీ చేయకపోయినా దాదాపు ప్రతి బ్యాటర్ వేగంగా పరుగులు చేయడంతో భారీ స్కోర్ నమోదయ్యింది. బెత్ మూనీ, కనికా ఆహుజా, కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ తొలి 10 ఓవర్లలోనే స్కోర్‌ను 97కి చేర్చారు.

ఇక మధ్య ఓవర్లలో ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో ఆ తర్వాతి 6 ఓవర్లలో కేవలం 36 పరుగులే వచ్చాయి. చివరి 4 ఓవర్లలో భారతి ఫూల్మాలి ధనాధన్ బ్యాటింగ్‌తో 56 పరుగులు సాధించడంతో గుజరాత్ 192 స్కోర్‌కి చేరుకుంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. తొలి 5 ఓవర్లలోనే 37 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఈ దశలో అమంజోత్ కౌర్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ కలిసి 44 బంతుల్లో 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇందులో యువ ఆల్‌రౌండర్ అమంజోత్ (40) దూకుడుగా ఆడింది.

PM Modi and Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని మోడీ అభినందనలు.. కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం..

అమంజోత్ అవుటైన తర్వాత హర్మన్‌ప్రీత్ గేర్ మార్చి దూకుడు పెంచింది. ఆమెకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ నికోలా కేరీ నుంచి అద్భుతమైన సహకారం లభించింది. ఒకే ఓవర్‌లో నాలుగు ఫోర్లు బాదిన కేరీ మ్యాచ్‌ను పూర్తిగా ముంబై వైపుకు తిప్పింది. ఆ తర్వాత ఇద్దరూ బౌండరీల వరద పారించారు. నాలుగో వికెట్‌కు కేరీ–హర్మన్‌ప్రీత్ మధ్య 84 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదైంది. చివరకు ముంబై 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. హర్మన్‌ప్రీత్ 43 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. కేరీ 23 బంతుల్లో 38 పరుగులతో అజేయంగా నిలిచి ముంబై విజయాన్ని ఖాయం చేసింది.

Exit mobile version