NTV Telugu Site icon

Gautam Gambhir: టీమిండియా బౌలింగ్‌ కోచ్‌తో గౌతమ్‌ గంభీర్‌కు విభేదాలు?

Gautam Gambhir

Gautam Gambhir

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ నియామకం అయినప్పటి నుంచి భారత జట్టుకు పెద్దగా కలిసి రావడం లేదు. కీలక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా సిరీస్‌ అనంతరం ఆటగాళ్లపై గౌతీ సిరీస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బౌలింగ్‌ కోచ్‌ మోర్ని మోర్కల్‌, గంభీర్‌కు మధ్య స్వల్ప విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అందులకే బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సమయంలో మోర్కల్‌ జట్టుతో అంటీముట్టనట్లు వ్యవహరించాడట. దీనిపై బీసీసీఐ సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం.

‘ఆస్ట్రేలియా టూర్‌లో ఓ ప్రాక్టీస్‌ సెషన్‌కు మోర్ని మోర్కల్‌ ఆలస్యంగా రావడం హెడ్ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు నచ్చలేదట. మోర్కల్‌ను మైదానంలోనే గౌతీ మందలించాడట. దీంతో మనసు నొచ్చుకొన్న మోర్కల్‌.. మిగిలిన మ్యాచ్‌లలో జట్టుతో అంటీముట్టనట్లు వ్యవహరించాడు’ అని బీసీసీఐ వర్గాలు ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించాయి. టీమిండియా సహాయ సిబ్బంది పని తీరుపై బీసీసీఐ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆరంభం కానున్నాయి. మరి ఈ సిరీస్‌లలో మోర్కల్‌, గంభీర్‌ బంధం ఎలా ఉంటుందో చూడాలి. మరో వారంలో మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. భారత్, ఇంగ్లండ్ జట్లు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి.