Site icon NTV Telugu

Gautam Gambhir: శ్రేయస్‌ అయ్యర్‌ను తప్పించాలనుకోలేదు.. గంభీర్‌ కీలక వ్యాఖ్యలు!

Shreyas Iyer

Shreyas Iyer

టీమిండియా వన్డే జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌ కీలక ఆటగాడు అని, అతడిని తప్పించాలని ఎప్పుడూ అనుకోలేదని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ తెలిపాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రాణించిన యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని భావించామని చెప్పాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్‌ 59 పరుగులు చేశాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి ధనాధన్ ఆటతో అలరించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్స్ కోల్పోయిన దశలో వచ్చిన శ్రేయస్‌.. 36 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సులతో 59 రన్స్ చేశాడు.

ఇంగ్లండ్‌తో రెండు, మూడు వన్డేల్లో వరుసగా 44, 78 పరుగులు చేసి భారత్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంలో శ్రేయస్‌ అయ్యర్‌ కీలక పాత్ర పోషించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడటంతో తనకు ఆడే అవకాశం లభించిందని తొలి వన్డే అనంతరం శ్రేయస్‌ చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ స్పందించాడు. ‘ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా శ్రేయాస్ అయ్యర్‌ను తప్పించాలనుకోలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రాణించిన యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలనుకున్నాం. కేవలం ఒక్క ఇన్నింగ్స్‌తో జైస్వాల్‌పై ఓ అభిప్రాయానికి రాలేము. జైస్వాల్‌ కంటే శ్రేయస్‌ మఖ్యమైన ఆటగాడు. శ్రేయస్‌ను తప్పించాలని మేం అనుకోలేదు’ అని గౌతీ తెలిపాడు.

ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం ప్రకటించిన జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ప్రకటించిన ప్రిలిమినరీ జాబితాలో యశస్వి జైస్వాల్‌ పేరు ఉంది. కానీ తుది జాబితాలో అతడికి చోటు దక్కలేదు. నాన్ ట్రావెలింగ్ జాబితాలో ఉన్నాడు. అవసరం అయితే జైస్వాల్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం యూఏఈ వెళ్తాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈనెల 17న విదర్భతో ఆరంభమయ్యే రంజీ సెమీఫైనల్లో ఆడే ముంబై జట్టులో సెలక్టర్లు యశస్వి పేరును చేర్చారు.

Exit mobile version