India vs Sri Lanka: గంభీర్‌కు అగ్ని పరీక్ష.. కెప్టెన్ గిల్‌కు బిగ్ సవాల్.. 7 టెస్టులు గెలవాల్సిందే!

Gautam Gambhir

Gautam Gambhir

India vs Sri Lanka: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారనుంది. గంభీర్ కోచింగ్‌లో భారత జట్టు సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాల చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. ఈసారి కూడా ఫలితాలు మారకపోతే గంభీర్‌తో పాటు మొత్తం జట్టుపై విమర్శల రావడం ఖాయం. ఈ నెలలో లంక గడ్డపై జరగనున్న ఈ టెస్టు సిరీస్ టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌కు ఓ అగ్నిపరీక్ష లాంటిది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో కేవలం గెలవడమే కాకుండా, భారత జట్టు ట్రాన్సిషన్ (మార్పుల దశ) సరైన దిశలోనే సాగుతోందో లేదో నిరూపించుకోవాల్సి ఉంది. గంభీర్ కోచింగ్‌తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వానికి కూడా ఇది సరికొత్త సవాలుగా మారనుంది.

ఈ అంశంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దీప్ దాస్‌గుప్తా మాట్లాడుతూ.. ఒకవేళ జట్టు వైఫల్యాలు ఇలాగే కొనసాగితే మొదటగా ప్రశ్నించేది గౌతమ్ గంభీర్‌నేనని పేర్కొన్నారు. కోచ్‌గా ఆయన ఈ బాధ్యత నుంచి తప్పుకోలేరని, గత కొన్ని నెలల ఫలితాలను బట్టి ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉండటం సహజమని ఐఏఎన్‌ఎస్ (IANS) ఇంటర్వ్యూలో వివరించారు. జట్టులో మార్పులు జరుగుతున్నాయని ప్రతిసారీ చెప్పడం కాకుండా, మైదానంలో ఆ మార్పుల ఫలితాలు కనిపించాలని దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు. కేవలం యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడమే ట్రాన్సిషన్ కాదని, జట్టు నిలకడగా రాణించడమే ముఖ్యమని చెప్పారు. సొంతగడ్డపై సిరీస్ ఓడిపోయిన తర్వాత విదేశాల్లోనూ ఓటములు ఎదురుకావడంతో ఇప్పుడు ప్రతి మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

ఇక, ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) సైకిల్‌లో భారత జట్టు పరిస్థితి ఏమంత బాగులేదు. పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 7 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. భారత్ రాబోయే రోజుల్లో శ్రీలంకలో 2, న్యూజిలాండ్‌లో 2, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడనుంది. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే 7 మ్యాచ్‌లు గెలవడం సులువైన విషయమేమీ కాదు. ఇదిలా ఉండగా.. భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాడే (Galle) ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతుంది. ఈ సిరీస్ గంభీర్ కోచింగ్, గిల్ కెప్టెన్సీలకు నిజమైన ‘లిట్మస్ టెస్ట్’ కానుంది.

శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్ (ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్.