Site icon NTV Telugu

Gautam Gambhir: ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. పిచ్ క్యూరేటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్‌!

Gautam Gambhir Pitch Curator

Gautam Gambhir Pitch Curator

Gautam Gambhir Clashes with Oval Pitch Curator: అండర్సన్‌-టెండ్యూలర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనకపడి ఉంది. లండన్‌లోని ఓవల్‌ స్టేడియంలో జులై 31 నుంచి ఆరంభమయ్యే అయిదో టెస్ట్‌ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా చూస్తోంది. ఇప్పటికే ఓవల్‌లో హెడ్ కోచ్‌ గౌతమ్‌ గంభీర్ నేతృత్వంలో టీమిండియా ప్లేయర్స్ సాధన చేస్తున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్‌లో సమయంలో పిచ్ క్యూరేటర్‌, గౌతీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ట్రెయినింగ్‌ సెషన్‌లో భాగంగా భారత ఆటగాళ్లతో గౌతమ్‌ గంభీర్‌ నెట్స్‌లో ఉన్నాడు. ఆ సమయంలో పిచ్ క్యూరేటర్‌ లీ ఫోర్టిస్‌ గౌతీ వద్దకు వచ్చి ఏదో అన్నాడు. గంభీర్‌ కూడా తగ్గలేదు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దాంతో టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కోటక్‌ మధ్యలో కలగజేసుకొని క్యూరేటర్‌ను దూరంగా తీసుకెళ్లాడు. అయినా కూడా గంభీర్‌, ఫోర్టిస్‌ మధ్య వాగ్వాదం కొనసాగింది. ఈ క్రమంలో క్యూరేటర్‌కు గంభీర్‌ ఇచ్చిపడేశాడు. ‘ఇక్కడ నువ్వు ఓ గ్రౌండ్ స్టాఫ్ మాత్రమే. మాకు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆట కోసం ఏం చేయాలో మాకు బాగా తెలుసు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. కావాలంటే మీ అధికారులకు ఫిర్యాదు చేస్కో’ అంటూ గంభీర్‌ వార్నింగ్ ఇచ్చాడు.

పిచ్ ప్రిపరేషన్‌పై క్యూరేటర్‌ లీ ఫోర్టిస్‌పై గౌతమ్ గంభీర్‌ సీరియస్ అయ్యాడని తెలుస్తోంది. పిచ్‌పై ఎక్కువ గ్రాస్ ఉండటాన్ని గౌతీ వ్యతిరేకించాడు. దాంతో క్యూరేటర్‌ టీమిండియా కోచ్ దగ్గరికి వచ్చి వాదించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. గంభీర్‌తో మాములుగా ఉండదు, గంభీర్‌తో పెట్టుకుంటే అంతే సంగతులు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు ప్లేయర్స్ మధ్య గొడవ జరగగా.. ఇప్పుడు స్టాఫ్ మధ్య కూడా జరుగుతున్నాయి.

Exit mobile version