Gary Kirsten interest on Team India Coaching: మరోసారి టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను ఎప్పుడూ సిద్దమే అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, క్రికెట్ కోచ్ గ్యారీ కిరిస్టెన్ తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును నడిపించడంపైనే పూర్తి దృష్టి సారించా అని చెప్పాడు. దక్షిణాఫ్రికాలో టీ20 లీగ్‌కు ఆదరణ పెరుగుతోందని, తమ దేశంలో క్రికెట్ బతకడానికి ఫ్రాంచైజీ టోర్నీ చాలా ముఖ్యమన్నాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ 2011లో వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన సమయంలో టీమిండియాకు హెడ్ కోచ్ గ్యారీ కిరిస్టెనే అన్న విషయం తెలిసిందే. 2008 నుంచి 2011 వరకు గ్యారీ టీమిండియా కోచ్‌గా ఉన్నారు.
ఓ జాతీయ మీడియాతో గ్యారీ కిరిస్టెన్ మాట్లాడుతూ… ‘చాలా మంది యువ క్రికెటర్లకు ఫ్రాంచైజీ క్రికెట్ ఓ వరంగా మారింది. యువకులు జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఇది మంచి అవకాశం. చాలా దేశాల్లో ఫ్రాంచైజీ లీగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. దక్షిణాఫ్రికాలోనూ టీ20 లీగ్‌కు ఆదరణ పెరుగుతోంది. మా దేశంలో క్రికెట్ బతకడానికి ఇలాంటి టోర్నీ చాలా ముఖ్యం. ఫ్రాంచైజీ క్రికెట్ ఆర్థికంగానూ కీలకపాత్ర పోషిస్తుంది. క్రికెట్‌లోకి రావాలనుకునే యువతకు స్ఫూర్తినింపడంలో ఫ్రాంచైజీ లీగ్‌ల పాత్ర ఎంతో ఉంది. ఈ టోర్నీలకు పిల్లలు వెళ్లి తమ అభిమాన క్రికెటర్లను చూడొచ్చు. అంతేకాదు వారు కూడా క్రికెట్ ఆడే దిశగా ఆలోచన చేయొచ్చు’ అని అన్నాడు.
Also Read: Zambia Cholera Outbreak: కలరాతో 600 మంది మృతి.. జాంబియాకు భారత్ సాయం!
‘ఐపీఎల్ కోసం నేను ప్రతి సంవత్సరం భారత్‌కు వస్తున్నా. ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్‌కు మెంటార్‌గా వ్యవహరించబోతున్నా. భారత్‌తో నాకు మంది అనుబంధం ఉంది. టీమిండియాకు మరోసారి కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమే. అయితే ఇప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఐపీఎల్ 2024లో గుజరాత్‌ను నడిపించడంపైనే దృష్టిసారించా. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడు. గత ఐపీఎల్‌లో 890 పరుగులు చేశాడు. అతడు కెప్టెన్‌గా కూడా రాణిస్తాడని నేను భావిస్తున్నా’ అని గ్యారీ కిరిస్టెన్ తెలిపాడు.