Ganja Smuggling: హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన మత్తు పదార్థాలు పోలీసుల రైడులో దొరుకుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో మరోసారి గంజాయి స్మగ్లింగ్ ఘటన చోటుచేసుకుంది. గంజాయి సరఫరాకు రైలు మార్గాన్ని ఎంచుకున్న ముఠా అనుమానిత ప్రవర్తనతో పోలీసులకి చిక్కింది. తనిఖీల్లో భాగంగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఉన్న ఓ బ్యాగుపై అధికారులు దృష్టి సారించారు.
ఆ బ్యాగు పరిశీలన చేయగా.. అందులో 13 ప్యాకెట్లుగా ప్యాక్ చేసిన 12 కిలోల గంజాయి ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. ఇది సుమారు రూ. 6 లక్షల విలువచేసే గంజాయిగా అధికారులు తెలిపారు. దీనితో ఇప్పుడు ఈ బ్యాగును ఎవరు ఉంచారన్న కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవలి కాలంలో గంజాయి తరలింపుకు రైలు మార్గం ఎక్కువగా ఉపయోగపడుతోందని పోలీసులు భావిస్తున్నారు. నిన్న (గురువారం) కూడా ఇదే తరహాలో దాధర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో, 12 కిలోల గంజాయితో ఓ వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఒడిశా రాష్ట్రం భరంపురా నుంచి గంజాయి తరలింపుగా ఈ ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లర్ సమీరా బిసోయ్‌ను కూడా జీఆర్‌పీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదకర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ప్రయాణికుడు అనుమానాస్పద వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
