NTV Telugu Site icon

Gangster Murdered in Tihar Jail: తీహార్‌ జైల్లో గ్యాంగ్‌ వార్‌.. గ్యాంగ్‌స్టర్‌ మృతి

Tillu Tajpuriya

Tillu Tajpuriya

Gangster Murdered in Tihar Jail: తీహార్‌ జైలులో గ్యాంగ్‌ వార్‌ జరిగింది.. ఈ ఘటనలో రోహిణి కోర్టు కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తజ్‌పూరియా ప్రాణాలు కోల్పోయాడు.. జైల్లో జరిగిన గ్యాంగ్‌ వార్‌లో అతను మృతిచెందినట్టు తీహార్‌ జైలు అధికారులు ప్రకటించారు. జైలులో జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన అతన్ని.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయడని పేర్కొన్నారు.. అయితే, తీహార్‌ జైలులో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ప్రత్యర్థి గ్యాంగ్‌ చేతిలో తజ్‌పూరియా తీవ్రంగా గాయపడ్డాడు.. అతడిపై యోగేష్‌ తుండా, అతని అనుచరులు ఇనుప రాడ్లతో దాడికి తెగబడినట్లు సమాచారం.. అయితే, తీవ్రంగా గాయపడిన టిల్లు తజ్‌పూరియాను ఢిల్లీ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

సునీల్ మాన్, అతని అలియాస్ టిల్లు తాజ్‌పురియా, ఢిల్లీలోని రోహిణి కోర్టులో జరిగిన కాల్పుల్లో ప్రధాన నిందితుడిగా జైలు పాలైన గ్యాంగ్‌స్టర్. అతను చాలా సంవత్సరాలు జైలులో ఉన్నాడు మరియు అతనిపై హత్య ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని పేరుపొందిన గ్యాంగ్‌స్టర్‌లలో ఒకరైన టిల్లూ తాజ్‌పురియా.. ఢిల్లీలో మోస్ట్‌ వాండెటెడ్‌ అయిన గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగిని కిందటి ఏడాది సెప్టెంబర్‌లో రోహిణి కోర్టు ప్రాంగణంలోనే కాల్చి చంపిన కేసులో ప్రధాన సూత్రధారి.. అప్పుడు మండోలా జైలు నుంచే అతను జితేందర్‌ హత్యకు ప్రణాళిక వేయడం గమనార్హం. అయితే.. జితేందర్‌ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు అప్పుడే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్‌ యాదవ్‌, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు విచారణలో తేలింది..

టిల్లు గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు న్యాయవాదుల వేషధారణలతో రోహిణి కోర్టులో విచారణకు వచ్చినప్పుడు గోగిని హత్య చేశారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టిల్లూ తాజ్‌పురియా.. ఇద్దరు షూటర్‌లతో జైలు లోపల నుండి వాట్సాప్ ద్వారా నిరంతరం టచ్‌లో ఉన్నారని మరియు రోహిణి కోర్టు లోపల షూటౌట్‌కు ఆయుధాలు పొందడంలో వారికి సహాయం చేశాడని తెలిపారు. గోగి టిల్లు యొక్క ప్రత్యర్థి ముఠా సభ్యుడు. అయితే, ఇప్పుడు తీహార్‌ జైలులో జరిగిన ఘర్షణలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.