G20: తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఈ నెల 28నుంచి జూన్ 17మధ్య జీ20 సమావేశాలు విడతల వారీగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతపై డీజీపీ అంజన్ కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని జీ20 సెక్యూరిటీ కో ఆర్డినేషన్ కమిటీలో నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ20 దేశాల అధినేతల అత్యున్నత సమావేశం జరుగనుందని డీజీపీ తెలిపారు. ముందస్తుగా దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూపు సమావేశాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. దీనిలో భాగంగా హైదరాబాద్ లో ఆరు సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈనెల28న తొలి సమావేశం జరుగుతుందని చెప్పారు. మార్చిలో 6 , 7, ఏప్రిల్ లో 26 , 27, 28, జూన్ లో 7,8,9, జూన్ లో 15 , 16 ,17 తేదీల్లో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు మంత్రులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారుల నుండి స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు హాజరవుతారు.
Read Also:Vande Bharat :సెల్ఫీ తెచ్చిన తంటా.. ఫోటో కోసం రైలెక్కి బుక్కయ్యాడు
సమావేశాలకు హాజరయ్యే ఉన్నతస్థాయి ప్రతినిధులు నగరంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశమున్నందున.. ఆయా ప్రాంతాల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు, వీఐపీలు బస చేసే హోటళ్లు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. ఎయిర్ పోర్టుతో పాటు నగరంలోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కోరారు.