Full Demand for AC Tickets in Train: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఏప్రిల్ ఆరంభంలోనే జనాలు బయటికి రావాలంటే.. భయపడిపోతున్నారు. మండుతున్న ఎండలు ప్రయాణాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఛార్జీలు కాస్త ఎక్కువైనా సరే.. ప్రయాణికులు ట్రైన్, బస్సుల్లో ఏసీ తరగతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బస్సుల్లో ఏసీ టికెట్లకు భారీ గిరాకీ ఉండగా.. రైల్లో ఏసీ ప్రయాణికుల వెయిటింగ్ లిస్టు 100-200ల పైనే ఉంటోంది.
తీవ్ర ఎండల కారణంగా ఏసీ బస్సుల్లోనూ ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాచలం వంటి నగరాలకు ఏసీ బస్సుల్లో డిమాండ్ పెరిగింది. మరోవైపు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి, ఒంగోలు, కర్నూలు, కడపకు ఏసీ బస్సుల్లో భారీ డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ ఆరంభంలోనే ఇలా ఉంటే.. మేలో పరిస్థితి ఎలా ఉంటుందో.
Also Read: Shashank Singh: కన్ఫ్యూజిన్‌లో జట్టులోకి వచ్చి ‘పంజాబ్’ హీరో అయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్?
ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు దాదాపుగా 16 రైళ్లు వెళతాయి. అందులో ఐదు ఏసీ రైళ్లు ఉండగా.. ఒక్కో దాంట్లో 600 నుంచి 1000 వరకు ఏసీ బెర్తులు ఉంటాయి. అయినా కూడా ఈ రైళ్లలో రిజర్వేషన్ దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రెండు వందేభారత్ రైళ్లు వెలుతాయి. ఒకటి ఉదయం 5.50 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతాయి. వందేభారత్‌లో ఛార్జీలు అధికం అన్న విషయం తెలిసిందే. ఛైర్‌కార్ టికెట్ ధర రూ.1,665, ఎగ్జిక్యూటివ్ రూ.3,120గా ఉన్నా.. టికెట్లు దొరకట్లేదు. 150కి పైగా వెయిటింగ్ లిస్టు ఉంటోంది. అన్ని రైళ్లను కలుపుకుంటే ప్రతిరోజు ఏసీ ప్రయాణానికి వెయిటింగ్ లిస్టు 1000కి పైనే ఉంటోంది.