Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?

Petrol and Diesel Prices

Petrol and Diesel Prices

Fuel Shortage: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంధన కష్టాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ముఖ్యంగా డీజిల్ కొరత వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అధికార వర్గాలు తగినన్ని నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి బంకుల ముందు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సరఫరా ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డీలర్లు తెలిపిన వివరాల ప్రకారం, చమురు సంస్థలు సరఫరాలో జాప్యం చేస్తున్న కారణంగానే సమస్య ఏర్పడింది. అవసరమైన స్థాయిలో ట్యాంకర్లు రాకపోవడంతో నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయని పేర్కొంటున్నారు. నిల్వలు లేకపోవడంతోనే “నో స్టాక్” బోర్డులు పెట్టాల్సి వస్తోందని పలువురు బంకు యజమానులు వెల్లడించారు. మరోవైపు సమస్యను త్వరగా పరిష్కరించి సాధారణ సరఫరా పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం 27 వ తేదీన డిమాండ్ ను మించి పెట్రోల్, డీజిల్ లను 29,939 కిలో లీటర్లు సరఫరా చేసినట్లు వివరించారు. సగటున రోజుకు 5,883 కిలో లీటర్లు పెట్రోల్, 7,348 కిలో లీటర్లు డీజిల్ కు డిమాండ్ ఉండేదని తెలిపారు. కానీ 27 వ తేదీన 11,490 కిలో లీటర్లు పెట్రోల్, 18,449 కిలో లీటర్లు డీజిల్ ను వాహనదారులకు సరఫరా చేసినట్లు స్పష్టం చేశారు. సరఫరాను క్షేత్ర స్థాయి అధికారులు, పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అపోహలతో పెట్రోల్, డీజిల్ ను నిల్వచేసుకోవద్దని వినియోగదారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సూచించారు.