NTV Telugu Site icon

Inspiring journey: నాడు ఖాళీ కడుపుతో బాలుడు అవస్థలు.. నేడు అమెరికాలో సైంటిస్ట్‌గా ప్రశంసలు

Tribal Boy

Tribal Boy

Inspiring journey: మహారాష్ట్ర గడ్చిరోలిలోని మారుమూల గ్రామంలో పుట్టిన ఓ గిరిజన బాలుడు ప్రస్తుతం సీనియర్‌ సైంటిస్ట్‌ అయ్యాడు. తన చిన్నతనంలో తినడానికి కూడా తిండిలేక అలమటించిన ఆ కుర్రాడు.. అగ్రరాజ్యంలో పరిశోధనలు చేస్తున్నాడు. అప్పటి బాలుడు.. నేటి సీనియర్‌ సైంటిస్ట్‌ ఎవరో కాదు.. భాస్కర్ హలామీ. జీవితంలో కృషి, దృఢచిత్తం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు. కుర్ఖెడా తహసీల్‌లోని చిర్చడి గ్రామంలో గిరిజన పేద కుటుంబం నుంచి వచ్చి భాస్కర్‌ హలామీ.. ప్రస్తుతం అమెరికాలోని మేరీల్యాండ్‌లో బయోఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన సిర్నామిక్స్ ఇంక్ పరిశోధన, అభివృద్ధి విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.

ఈ సంస్థ జన్యు ఔషధాలలో పరిశోధనలు నిర్వహిస్తుంది. ఆ సంస్థలో సీనియర్‌ సైంటిస్ట్‌ హలామీ.. ఆర్‌ఎన్‌ఏ తయారీ, సంశ్లేషణను చూస్తున్నారు. భాస్కర్‌ ఈ స్థాయికి ఎదగడానికి ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాడు. చిర్చాడి గ్రామంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ సంపాదించిన మొదటి వ్యక్తిగా పేరుగాంచారు. తన చిన్నతనంలో కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉండేవని భాస్కర్‌ హలామీ గుర్తు చేసుకున్నారు. చిన్న ఇంట్లో చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆయన వివరించారు. తిండి లేదా పని లేనప్పుడు కుటుంబం ఆ దశలో ఎలా జీవించిందో తమ తల్లిదండ్రులు ఇప్పటివరకు ఆలోచిస్తున్నారని శాస్త్రవేత్త చెప్పారు. తిన్నా జీర్ణించుకోలేని మహువా పూలు వండుకుని తిన్నామని ఆయన గుర్తు చేసుకున్నారు.

చిర్చాడిలో 400 నుంచి 500 కుటుంబాలు నివసిస్తుండగా.. హలామీ తల్లిదండ్రులు గ్రామంలో ఇంటి సహాయకులుగా పనిచేశారు, వారి పొలంలో పండే పంటలు వారు తినడానికే సరిపోవు.. కావున గ్రామస్థుల ఇళ్లలో పనిచేశారు. 7వ తరగతి వరకు చదివిన హలామీ తండ్రి 100 కి.మీ దూరంలో ఉన్న కసన్‌సూర్ తహసీల్‌లోని ఒక పాఠశాలలో ఉద్యోగం రాగా.. అక్కడికి వెళ్లడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయని ఆయన చెప్పారు.

US Air Show: విన్యాసాలు చేస్తూ ఢీకొన్న 2 యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి

హలామి తన ప్రారంభ పాఠశాల విద్యను 1 నుండి 4 వరకు కసన్సూర్‌లోని ఆశ్రమ పాఠశాలలో చదివాడు. స్కాలర్‌షిప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, అతను 10వ తరగతి వరకు యవత్మాల్‌లోని ప్రభుత్వ విద్యానికేతన్ కేలాపూర్‌లో చదివాడు. గడ్చిరోలిలోని కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని సంపాదించిన తర్వాత, భాస్కర్‌ హలామీ నాగ్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి రసాయన శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2003లో నాగ్‌పూర్‌లోని ప్రతిష్టాత్మక లక్ష్మీనారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హలామీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.

ఆయన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (MPSC) పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ హలామీ దృష్టి మాత్రం పరిశోధనపైనే ఉంది. ఆయన యునైటెడ్ స్టేట్స్‌లో పీహెచ్‌డీని కొనసాగించాడు. తన పరిశోధన కోసం డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలను ఎంచుకున్నాడు. హలామీ మిచిగాన్ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. తన తల్లిదండ్రుల వల్లే ఈ విజయం సాధ్యమైందని, కష్టపడి పనిచేసి తనను చదివించారని హలామీ తెలిపారు. హలామీ తన తల్లిదండ్రులు నివసించాలనుకున్న చిర్చాడిలో తన కుటుంబానికి ఇల్లు నిర్మించాడు. కొన్నేళ్ల క్రితం తండ్రిని కోల్పోయాడు. ఇటీవల గడ్చిరోలిలో రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ రవీంద్ర ఠాక్రే ఈ పరిశోధకుడిని సత్కరించారు. గిరిజన అభివృద్ధి శాఖ తన ‘ఎ టీ విత్ ట్రైబల్ సెలబ్రిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హలామీ మొదటి సెలబ్రిటీగా హాజరయ్యారు.

Show comments