ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నాలుగు రోజుల భారత్ పర్యటన కోసం మంగళవారం తెల్లవారుజామున ముంబైకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్, మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఇక హోటల్‌కు చేరుకున్నాక మాక్రాన్ సామాన్యుడిలా మారిపోయారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లోకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా జాగింగ్‌కు వచ్చేశారు. ఉదయాన్నే వాకింగ్ చేసే ముంబై వాసులంతా ఆశ్చర్యపోయారు. ఈ హఠాత్తు పరిణామంతో షాకైన ప్రజలు మొబైల్స్‌లో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మంగళవారం ఉదయం ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో యధావిధిగా ముంబై వాసులు వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో కొంత మందితో కలిసి మాక్రాన్ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చింది అధ్యక్షుడు అని తెలియక స్థానికులు అవాక్కయ్యారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా రావడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా మంది మాక్రాన్ అన్న విషయం గుర్తించలేకపోయారు. ఆయన కూడా హాయ్.. చెప్పుకుంటూ సామాన్యుడిలానే వెళ్లిపోయారు. మొత్తానికి మాక్రాన్ అన్న విషయం తెలిశాక మొబైల్స్‌లో బంధించారు.
ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటించేందుకు వచ్చారు. భారతదేశం నిర్వహించే ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అలాగే ముంబైలో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. రక్షణ సహకారం, శక్తి, స్టార్టప్ భాగస్వామ్యాలు, ఆర్థిక పెట్టుబడులు వంటి అంశాలపై చర్చించనున్నారు. మాక్రాన్ భారతదేశానికి రావడం ఇది నాల్గోసారి. ముంబైలో పర్యటించడం మాత్రం ఇదే తొలిసారి.
ఆ మధ్య అమెరికాలో పర్యటించినప్పుడు కూడా మాక్రాన్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. ట్రంప్ కాన్వాయ్ వెళ్లడంతో నడిరోడ్డుపై ఆగిపోయారు. దీంతో వెంటనే ట్రంప్‌కు ఫోన్ చేసి కాన్వాయ్ కారణంగా రోడ్డుపై ఆగిపోయినట్లు తెలిపారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయింది.
